హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది. శనివారం సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐఎస్ను ప్రారంభించిన నేపథ్యంలో దే శం యావత్తు ఈ అద్భుత ప్రాజెక్టుపై దృష్టిపెట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు కృష్ణమ్మను బిరబిరా మళ్లిస్తున్న తెలంగాణ సర్కారు పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. నెటిజన్లు ఎక్స్ (ట్విటర్) వేదికగా #PalamuruRangareddyProject పేరుతో ట్వీట్లు చేయగా, టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తి మాటలు చెప్పి కాలయాపన చేస్తే.. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు ఆవిష్కరించారని నెటిజన్లు కొనియాడారు. ‘తెలంగాణ గడ్డపై మరో భగీరథ ప్రయత్నం పూర్తయింది’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు. ‘పాలమూరు కరువును శాశ్వతంగా పారదోలి, రైతుల దశాబ్దాల కల నెరవేర్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్లతో హోరెత్తించారు. ‘ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణమ్మ నీళ్లను ఎత్తిపోస్తూ రైతు బాంధవుడిగా, అపర భగీరథుడిగా నిలిచారు సార్.. మీరు గ్రేట్’ అంటూ సీఎం కేసీఆర్ విజన్‌ను కొనియాడారు.‘నాడు పాలమూరు అంటే కరువు, కన్నీళ్లు, వలసలు.. నేడు పచ్చని పాలమూరు’ అని అభివర్ణించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడంతో ఎంతో సంతోషంగా ఉన్నది. నీటిని తీసుకుపోయి మా ఇంటి దేవత పాదాలను కడుగుతా. ఎన్నో ఏండ్లుగా మా భూములు బీడుగా ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో ఇప్పుడు మా గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది. ఇన్నేండ్లు పడిన బాధను సీఎం కేసీఆర్ తీర్చిండు. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటాం.
– బీమ్యానాయక్, ఈర్లకుంటతండా, నాగర్‌కర్నూల్ జిల్లా
కేసీఆర్‌ను దేవుడు సల్లంగా సూడాలే..
అందరికీ మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేవుడు సల్లంగా సూడాలే. ఇన్నేండ్ల పాలనలో ఎవరూ ఇంత మంచి పరిపాలన అందించలే. పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతులకు సాగునీరు ఇలా అందరి బాగు కోసం ఆలోచిస్తున్నరు. గతంలో సొంత కుటుంబ సభ్యులే మమ్మల్ని పట్టించుకోలే. సొంత కొడుకులా సీఎం సారు మాకు పింఛన్ ఇచ్చి ఆసరాగా నిలుస్తున్నడు. కేసీఆర్ మాట ఇస్తే నెరవేర్చే వరకు వదిలిపెట్టరు. ఇట్లాంటి గొప్ప వ్యక్తికి మనమంతా అండగా నిలవాలె.
– హసీన్, పెద్దమందడి, వనపర్తి జిల్లా