మహబూబ్‌నగర్, జూలై 3: ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ప్రాంగణంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రస్తుతం 80 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రి య కొనసాగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం కాదని, ప్రైవేటు రంగంలోనూ ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. జాజ్మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయని, 5 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించేందుకు జాబితాను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మేళాకు హాజరై ఉద్యోగాలు రాని వారి వివరాలతో మరో జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబానికీ భరోసాను కల్పించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.