Yashaswini Reddy | రాయపర్తి, నవంబర్ 12: ‘నాలుగు రోజుల్లో రూ. 4 వేల పింఛన్ వస్తది. రాకపోతే నాకు గుర్తుచేయాలి’ అంటూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఓ వృద్ధురాలితో చెప్పిన పాత వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే చెప్పిన నాలుగు రోజులు పోయి.. ప్రస్తుతం 49 రోజులు గడుస్తున్నది. అయినా.. ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న వృద్ధురాలికి పెరిగిన పెన్షన్ అందడం లేదంటూ సెటైర్లు పేలుతున్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామం (పాలకుర్తి నియోజకవర్గం)లో నిర్వహిస్తున్న కేజీబీవీ పాఠశాలను సెప్టెంబర్ 24న అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణమవుతున్న సందర్భంగా పాఠశాల సమీపంలో నివాసముండే వృద్ధురాలు సోమలక్ష్మి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి వాహనానికి అడ్డుగా వచ్చి మాట్లాడేందుకు యత్నించింది. ఆమెను ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే కారులో నుంచి బయటకు వచ్చి వృద్ధురాలిని ఏం కావాలని అడిగింది. తనకు కేసీఆర్ ఇస్తున్న రూ.2 వేల పింఛన్ సరిపోవడంలేదని, ఇబ్బందులు పడుతున్నానని తెలిపింది.
వెంటనే ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ.4 వేల పెన్షన్ వస్తుందని వృద్ధురాలికి చెప్పడంతోపాటు.. రాకపోతే తనకు గుర్తుచేయాలని అక్కడే ఉన్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జినుగు రత్నాకర్‌రెడ్డి, గజవెల్లి రామశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డికి సూచించారు. ఇప్పటికి 49 రోజులైనా ఫలితం లేకపోవడంతో ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
2000 పెన్షన్ సరిపోవడం లేదు 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అడిగిన వృద్ధురాలు#AasaraPension #Telangana #Congress #MLA #YashaswiniReddy pic.twitter.com/oicFA0Bbky
— Telugu Express (@TeluguExp) November 12, 2024