పాలకుర్తిః ఈ నెల నవంబర్ 18,19, 20 వ తేదీల్లో ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఫొటో ట్రేడ్ ఎక్స్పో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి అయిదు గుళ్ల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఒక్క ఫోటో అనేక భావాలకు దర్పణంగా నిలుస్తుందన్నారు. ఫొటోలు మంచి అనుభూతులు, జ్నాపకాలను మిగులుస్తాయని ఆయన అన్నారు. ఫోటోగ్రాఫర్లు కూడా తమ కెమెరా కన్నుతో చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఫోటోగ్రాఫర్లు ఐక్యంగా ఉండాలని, వారి కార్యక్రమాలు విజయవంతం కావాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జడ్పీటీసీ పుసుకూరి శ్రీనివాస్ రావు, టీఆర్ెస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, మండల ఫోటో గ్రాఫర్ల యూనియన్ అధ్యక్షుడు జీడీ సంజయ్, ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రదీప్ కుమార్, జిల్లా కార్యదర్శి పట్టూరి శ్రీను, గజ్జి రాజు, సంతోష్, నరేష్, శ్రీకాంత్, మహేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.