హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మంత్రులు, ఎమ్మెల్యేల వంటివారు కనిపించినప్పుడు విలేకరులు మాట కలపడం, వివిధ కోణాల్లో ప్రశ్నలు అడగడం, తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సీన్ రివర్స్ అయింది. మంత్రులే విలేకరులను అటకాయించి మరీ ప్రశ్నలు అడిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరు మంత్రివర్గ సహచరులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి సమీపంలోనే విలేకరులు కనిపించారు. మంత్రి ఉత్తమ్ కాస్త వేగంగా అడుగులు వేసి వారి వద్దకు వెళ్లారు. ‘ఏం సంగతి సార్లు, ఎవరు.. ఎవరిని.. తలంటారు? ఎవరు షాక్ అయ్యారు’ అంటూ నవ్వుతూనే విలేకరులను ప్రశ్నించారు.
తలంటిన వార్త రాసిన పత్రిక విలేకరులు వెంటనే బిక్కముఖం వేసి ‘అది మేం రాసింది కాదు సర్’ అంటూ తడబడ్డారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి ‘మీ పత్రికే రాసింది సార్’ అని సెటైర్ వేశారు. ‘ఏ పత్రికో గానీ.. పెయిడ్ వార్త రాయించుకుంటే సరిపోతుందా? లోపల ఏం జరిగిందో! ఎవరు తలంటారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరాలు బయటికి తీసి సిద్ధం చేసుకుంటుండటంతో.. సహచర మంత్రులు కలగజేసుకొని ‘అన్నా! మనం ఒకటి చెప్తే వాళ్లు రెండు రాస్తారు’ అంటూ ఉత్తమ్‌ను వెంట తీసుకొని వెళ్లారు. దీంతో ‘తలంటారు’ అంటూ గొప్పగా హెడ్డింగ్ పెట్టుకొని, హడావుడి చేసిన వార్త మొత్తం పెయిడా? అని అక్కడ చర్చ జరిగింది. కావాలనే పెయిడ్ వార్త ఎవరు రాయించుకున్నారు? అంటూ ఆరా తీశారు.