హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమలలో అన్యమత గుర్తు కలకలం రేపింది.హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తిరుమల సీఆర్వో కార్యాలయం ఎదుట ఓ దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు. రూమ్‌కు వెళ్లి ఆ కడియాన్ని పరిశీలించగా దానిపై అన్యమతానికి సంబంధించిన పేరు, సింబల్‌ను గుర్తించారు. దీంతో కంగుతిన్న ఆ భక్తులు విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత దుకాణంలో తనిఖీలు చేపట్టారు. అలాంటి వస్తువులను విక్రయిస్తున్నట్టు గుర్తించి దుకాణాన్ని మూసివేయించారు. కాగా, బాధిత దుకాణదారుడు మాత్రం తాము విక్రయించిన వస్తువులపై అన్యమత గుర్తులు ఉన్నట్టు తమకు తెలియదని అధికారులకు వివరించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత నెల 6న ప్రారంభించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో పది శాతం కూడా కాలేదని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 95 నుంచి 98 శాతం వరకు పూర్తయ్యినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 76శాతం సర్వే చేసినట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన సర్వే వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నామని, ఈ నెల 9లోగా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. 94 వేల మంది ఎన్యూమరేటర్లు, 9వేల మంది సూపర్వైజర్లు సర్వేలో పాలుపంచుకున్నారని తెలిపారు.