హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత పద్మశాలీ సంఘం నేతలు శుక్రవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో అఖిలభారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, నటి, సామాజిక కార్యకర్త పూనమ్‌కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనే మోదీ..అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఇక్కడికి వచ్చామన్నారు. చేనేత ఉత్పత్తులపై పన్ను విధించడం గాంధీ సిద్ధాంతానికి విరుద్ధమని చెప్పారు.