Padma Vibhushan | ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను మూడుసార్లు అందుకున్న తొలి వైద్యుడిగా రికార్డు సృష్టించారు. గతంలో భారత్‌లో ఎవరూ మూడు పద్మాలను అందుకోలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను సైతం అందుకున్నా. తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించడంతో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న వైద్యుడిగా ఘనతకెక్కారు.
డాక్టర్ నాగేశ్వర్రెడ్డిది ఏపీలోని విశాఖపట్నం. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మద్రాస్ మెడికల్ కళాశాలలో ఎండీ, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో డీఎం పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడిగా సేవలందించారు. అనంతరం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిని నెలకొల్పారు. వైద్యంలో సరికొత్త ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు అందించడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి 40 రకాల సేవలను అందిస్తున్నారు. పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (POEM)ను పరిచయం చేసిన తొలి వైద్యుడిగా నాగేశ్వరరెడ్డి నిలిచారు. ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టంట్ను డెవలప్ చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల కోసం ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (AHF)ని స్థాపించారు.
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి బృందం కరోనా సమయంలో వైరస్‌పై పోరాటంలో కీలకపాత్ర పోషించారు. కొవిడ్-19 రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆయన బీసీ రాయ్, మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు, జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వీ షిండ్లర్ అవార్డులు అందుకున్నారు. అలాగే, తొలిసారిగా 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అందుకోగా.. తాజాగా పద్మ విభూషణ్ వార్డు వరించింది. ఇక నాగేశ్వర్‌రెడ్డి సతీమణి కార్యల్ యాన్‌రెడ్డి డెర్మటాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కూతురు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పని చేస్తున్నారు.