KTR | హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అనంతరం మొగులయ్య, గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు కేటీఆర్ సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మొగులయ్య కేటీఆర్‌తో మాట్లాడుతూ, ఒకప్పుడు అడవుల్లో కిన్నెర వాయించుకునే తనకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతోనే గుర్తింపు దక్కిందని తెలిపారు. కేసీఆర్ గుర్తించడం వలనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇంటి స్థలం వివాదాన్ని పరిష్కరించి, కోర్టు కేసుల విషయంలో సహాయం చేయాలని మొగులయ్య కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS భరోసా
ఇంటి స్థలం సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని… pic.twitter.com/9OrQxNyMyt
— BRS Party (@BRSparty) October 18, 2025