Darshanam Mogilaiah | రంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): 52 దేశాల ప్రతినిధుల ఎదుట 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ కళామతల్లి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన కిన్నెర మొగులయ్య (దర్శనం మొగులయ్య) వేదన అరణ్య రోదనే అవుతున్నది. తన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా మారి పలువురికి స్ఫూర్తినిస్తున్నా.. ఆయన గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తెలంగాణ కళాకారులకు సముచిత గౌరవం ఇస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్.. కనీసం పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్న గౌరవం కూడా లేకుండా ఆయన మొర వినేందుకూ సమయం ఇవ్వడం లేదు. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో తనకు హయత్‌నగర్‌లో గత ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కాజేసి తనకు దక్కకుండా చేస్తున్నారని సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరై తన గోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్‌కు దరఖాస్తు చేసిన అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘నన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయత్‌నగర్ మండలం కుంట్లూరు రోడ్డులో 600 గజాల ఇంటిస్థలం కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి నన్ను గౌరవించింది. కానీ, ఆ స్థలం తనదంటూ మరోవ్యక్తి వచ్చి అడ్డుపడుతున్నడు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ను చాలాసార్లు కలిసిన. అయినా ప్రయోజనం లేక ముఖ్యమంత్రిని కలిసేందుకు పలుమార్లు ఆయన ఇంటివద్దకు వెళ్లిన. కానీ, అక్కడ సెక్యూరిటోళ్లు అడ్డుకుంటున్నరు. ఎన్నిసార్లు వెళ్లినా బయటనుంచే వెళ్లగొడుతున్నరు. ముఖ్యమంత్రి మా పటేల్.. మా ఊరు పక్కనే కొండారెడ్డిపల్లికి చెందిన వ్యక్తి అని చెప్పినా నెనరు లేదు. నాకు కేటాయించిన ఇంటి స్థలాన్ని దక్కించుకోవటం కోసం తిరిగీతిరిగి బువ్వకూడా లేకుండా పోతున్నది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని నాకు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. నా భూమిలోకి నన్నే రానివ్వకుండా కొందరు ఆ భూమిపై కేసులు వేసి నన్ను ఇబ్బందుల పాలుజేస్తున్నరు. ఇంటిస్థలాన్ని దక్కించుకోవటం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనేక కష్టాలు పడుతున్న. కొన్నికొన్ని సందర్భాల్లో తిండి తినేందుకు కూడా డబ్బులు లేకుండా పోయినయ్. బస్సు చార్జీలు కూడా పెట్టుకునే స్థితిలో లేను. ఇప్పటికైనా అధికారులు, ముఖ్యమంత్రి స్పందించి నా భూమిని నాకు ఇప్పించాలె’ అని వేడుకున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన స్థలం నాకు దక్కకుండా మరోవ్యక్తి వచ్చి అడ్డుపడుతున్నడు. ఈ విషయం మీద కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ను కలిసిన. అయినా ప్రయోజనం లేక ముఖ్యమంత్రిని కలిసేందుకు చాలాసార్లు ఆయన ఇంటి వద్దకు పోయిన. కానీ, అక్కడ సెక్యూరిటోళ్లు సీఎంను కలువనిస్తలేరు. ఎన్నిసార్లు వెళ్లినా బయటనుంచే వెళ్లగొడుతున్నరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా పటేల్. మా ఊరు పక్కనే కొండారెడ్డిపల్లి వ్యక్తి అని చెప్పినా ఇంత కూడా నెనరు లేదు. నాకు కేటాయించిన స్థలాన్ని దక్కించుకునేందుకు తిరిగీతిరిగి బువ్వకూడా లేకుండా పోతాంది.
-పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య