మెదక్ : అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని(Wet grain) ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) డిమాండ్ చేశారు. మెదక్(Medak) పట్టణ పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి, ఔరంగాబాద్ తండా, మెదక్ మండలం పాతూరులో అకాల వర్షానికి తడిసిన ధాన్యం రాశులను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొలకెత్తిన చివరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
గత ప్రభుత్వంలో తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకున్నామని గుర్తు చేశారు.
గెలువగానే రైతుల ఖాతాల్లో వేస్తానన్న రైతుబంధు వేయకపోగా, క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను తూకం వేసి వెను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడి నష్టపోయిన రైతులక ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.