Kaushik Reddy : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ విచారణ చేపట్టారు. ఈ విచారణకు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.
తాను మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ విచారణకు హాజరయ్యానని కౌశిక్‌రెడ్డి చెప్పారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా తాను స్పీకర్‌ను కోరానని తెలిపారు. ఆయనపై అనర్హత వేటు వేసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలని విన్నవించినట్లు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు.
అదేవిధంగా తన స్వగ్రామం వీణవంకలో గురువారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనపై కూడా కౌశిక్‌రెడ్డి స్పందించారు. ఘటనపై స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు తెలిపారు. తన సొంత గ్రామంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని ఆరోపించారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టనని చెప్పారు.