Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాల్లో అధికంగా సాగై.. సరికొత్త చరిత్ర లిఖించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం పంటల సాగు 1.26 కోట్ల ఎకరాలు దాటింది. పత్తి 45.16 లక్షల ఎకరాలు, మక్కజొన్న 5.46 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.67 లక్షల ఎకరాలు, కందులు 4.74 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
2018-19 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వరి సాగులో అంతంత మాత్రమే. 30 లక్షల ఎకరాలు దాటిన దాఖలాలు లేవు. అలాంటిది 2019-20 సంవత్సరం నుంచి వరి సాగులో నయా చరిత్ర ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అంటే 2014-15లో వానకాలంలో వరి సాగు 22.74 లక్షల ఎకరాలు మాత్రమే. అది 2018-19లో 29.38 లక్షల ఎకరాలకు చేరింది. ఆ తర్వాత 2019-20 నుంచి వరి సాగు భారీగా పెరగడం మొదలైంది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలకళ పెరిగింది. సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆ ఏడాది 41.18 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఆ తర్వాత ప్రతియేట వరి సాగు పెరుగుతూ వస్తున్నది. తొలిసారిగా 2020-21లో 50 లక్షల మార్క్‌ను దాటి 53.33 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదైంది. ఆ తర్వాత ఇది 60 లక్షలకు చేరింది. వరుసగా మూడేండ్లుగా 60 లక్షలకుపైగా వరి సాగవుతుండటం విశేషం. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఇదే అత్యధికమనుకున్నాం. కానీ ఈ ఏడాది అంతకు మించి 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే తెలంగాణ తొలినాళ్లతో పోల్చితే వరి సాగు ఏకంగా 42.26 లక్షల ఎకరాలు పెరగడం విశేషం.
ఒకప్పుడు తిండి గింజల కోసం అలమటించిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అదే వరి సాగులో రికార్డులు సృష్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ పథకాలు పంటల సాగుకు ప్రా ణం పోస్తున్నాయి. ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టులు, లిఫ్టులతో సాగునీరు, రైతుబంధుతో పెట్టుబడిసా యం, ఎరువులు, విత్తనాల సరఫరా ఇలా అనేక చర్యలతో సాగుకు కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా మారింది. దాంతో ఒక్క వరి సాగే కాదు.. మొత్తం పంటల సాగు కూడా భారీగా పెరిగింది. తెలంగాణ తొలినాళ్లలో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే ప్రస్తుతం ఇది 2.21 కోట్ల ఎకరాలకు పెరిగింది.