నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 4: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు నీటిపాలు చేశాయి. మళ్లీ మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు, మార్కెట్లకు అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు, ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోయాయి. సమయానికి మార్కెట్ అధికారులు టార్పాలిన్లు ఇవ్వలేదని, కండ్లముందే పంట కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక పోయామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌తోపాటు నర్సంపేట-మల్లంపల్లి ఎన్‌హెచ్ -365కి ఇరువైపులా పలు గ్రామాల్లో రైతులు ఆరబోసిన మక్కలు వర్షానికి తడిసిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సిమెంట్ కల్లాలపై ఆరబోసిన సుమారు 3వేల బస్తాల మక్కజొన్న తడిసింది.
వరుసగా కురుస్తున్న వర్షాలకు కేసముద్రం మండలంలో వరి పంటలు నేలవాలగా, వరి కంకులకు మొలకలు వస్తున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించకపోవడంతో పలువురు అద్దెకు తెచ్చుకొని వినియోగిస్తున్నారు. మరికొందరికి టార్పాలిన్లు లేకపోవడంతో మార్కెట్, కల్లాల్లోని ధాన్యం తడిసింది. నేరడుగం, వర్కూరుతోపాటు పలు గ్రామాల్లో ఒక్కో రైతు 20 నుంచి 30 ఎకరాల వరకు పంటలు పండించారు. మక్తల్ మండలంలోని ముష్టిపల్లి, మాధ్వార్తోపాటు పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. 40 నుంచి 70 శాతానికిపైగానే ధాన్యం తడిసినట్టు రైతులు వాపోయారు. ఉమ్మడి కరీంనగర్ జి ల్లాలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో రైతులు పూర్తిగా నష్టపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవగా, మరికొంత కొట్టుకుపోయింది. ఇంకా కోయని పొలాలు నేలమట్టమయ్యాయి. కండ్ల్లముందే వరదపాలైన ధాన్యాన్ని ఎత్తలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా తడిసిపోయింది. సిర్సపల్లిలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం పక్కనే ఉన్న రాజన్న చెరువులోకి కొట్టుకుపోయింది. గంగాధర, మానకొండూర్, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాల్లోనూ తీరని నష్టాన్ని మిగిల్చింది.