హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడుతున్నాయి. వెరసి రైస్‌మిల్లుల పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. నష్టాలు భరించలేక కొందరు యజమానులు మిల్లులను మూసేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జిల్లాకు సగటున 10 మిల్లులు వరకు మూతపడినట్టు రైస్‌మిల్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాల్లో ఇప్పటికే 320కిపైగా మిల్లులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలో రైస్‌మిల్లు ఇండస్ట్రీ కనుమరుగు కావడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,368 మిల్లులు ఉండగా, ఇందులో 2,353 రా రైస్ మిల్లులు, 1,015 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో సుమారు రెండు వేల మిల్లులు నష్టాల్లో నడుస్తున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా రా రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది.
అమ్మకానికి మిల్లులు
నల్లగొండ జిల్లాకు చెందిన ఒక బడా మిల్లర్‌కు ఏడు మిల్లుల్లో భాగస్వామ్యం ఉన్నది. మొన్నటివరకు బాగానే నడిచిన వ్యాపారం కొద్దికాలంగా నష్టాల వైపు పయనించింది. దీంతో ఆయన ఆయా మిల్లులను అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో చాలామంది రైస్ మిల్లర్లదీ ఇదే పరిస్థితి. ఇటు ప్రభుత్వం, అటు ఎఫ్‌సీఐ, మరోవైపు చోటామోటా నేతల వేధింపులు వెరసి మిల్లర్లపై అన్ని వైపుల నుంచి దాడి మొదలైనట్టు వారు వాపోతున్నారు. తాము వద్దని చెప్పినా వినకుండా ప్రభుత్వం నుంచి ధాన్యం ఇస్తున్నారని, దించుకోకపోతే విజిలెన్స్ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ధాన్యం దించుకున్న తర్వాత సీఎమ్మార్ సేకరించే విషయంలో ఎఫ్‌సీఐ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని వాపోతున్నారు.
సీఎమ్మార్ తీసుకోవడంలో ఎఫ్‌సీఐ చేస్తున్న ఆలస్యం వల్ల ఆ ప్రభావం ఆర్థికంగా, మానసికంగా తమపై పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎఫ్‌సీఐ చేస్తున్న తప్పులకు కూడా తమను బాధ్యులు గా చేసి బద్నాం చేస్తున్నారని వాపోతున్నారు. ఇటువంటి బాధలు, నష్టాలను తట్టుకోలేక కొందరు మిల్లర్లు ఏకంగా తమ మిల్లులనే అమ్మకానికి పెడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 320 పైగా మిల్లుల్లో మిల్లింగ్ బంద్ చేయగా పదుల సంఖ్యలో మిల్లులు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. అయితే, వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రైస్‌మిల్లుల వ్యాపారం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నది. దీంతో మిల్లర్లు తమ మిల్లులను అమ్ముకోలేక, వాటిని కొనసాగించలేక నానా అవస్థలు పడుతున్నారు.
మిల్లర్లపై కత్తిగట్టిన సర్కారు
రైస్ మిల్లర్లపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టిందని, మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించేవిధంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిల్లర్లను దొంగలంటూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సర్కారుకు తమ బాధలు చెప్పుకొనే పరిస్థితి లేదని, వినేవాళ్లే కరువయ్యారంటూ మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ మంత్రి వద్దకు వెళ్లినా తమ గోడు వినడం లేదని వాపోతున్నారు. ఇండస్ట్రీలో కొద్దిమందిగా ఉన్న చెడ్డవారిని చూపించి, ఆ నెపాన్ని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించి ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లకు ‘టెండర్’ పోటు…
రాష్ట్రంలోని మెజార్టీ మిల్లర్లపై 2022-23 ధాన్యం టెండర్ల ఎఫెక్ట్ పడింది. టెండర్ ధాన్యం పేరుతో మిల్లర్లను ఒక రేంజ్లో ఇబ్బందులకు గురిచేసినట్టు తెలిసింది. టెండర్ దక్కించుకున్న కంపెనీలు ధాన్యం ఎత్తకుండా, ధాన్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యం వేలం వేయగా, ఆయా కంపెనీలు మాత్రం 20 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఎత్తినట్టు తెలిసింది. ఇందులోనూ కేవలం 2-3 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే భౌతికంగా తీసుకెళ్లి, మిగిలిన మొత్తానికి పేపర్లపైనే తతంగం నడిపినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మిల్లర్ల నుంచి టెండర్ ధరకు అదనంగా రూ.200-300 వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. మిల్లుల్లో ధాన్యం ఉన్న మిల్లర్ల నుంచి కూడా ధాన్యం తీసుకోకుండా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ విధంగా కొంతమంది మిల్లర్లు టెండర్ ధాన్యం వల్ల నష్టాలపాలైనట్టు చర్చించుకుంటున్నారు.
సన్నబియ్యం పరేషాన్
ఇప్పటికే ఉన్న ఇబ్బందులు చాలవన్నట్టుగా తాజాగా సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం తమపై మరో పిడుగు వేసిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యాసంగిలో సన్న ధాన్యం నుంచి నిబంధనల మేరకు బియ్యం రావడం కష్టమని, అయినప్పటికీ ఇవ్వాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ప్రతి క్వింటాల్ ధాన్యానికి 67 కేజీల బియ్యం రావాలి. కానీ, యాసంగిలో క్వింటాల్ సన్న ధాన్యం నుంచి 50-55 కేజీల వరకు బియ్యం వస్తాయి. మిగిలిన 17 కేజీల భారం ఎవరు భరించాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఆ భారం మిల్లర్లే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.