గుండాల, జూలై 5 : కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో రూ.2వేల పింఛన్ అమలు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సవాల్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం సభలో తాము అధికారంలోకొస్తే రూ.4వేల పింఛన్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని విమర్శించారు. నాడు సోనియాగాంధీని దయ్యంతో పోల్చిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం దేవత అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిది రెండు నాల్కల ధోరణి అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మరని, నాడు టీడీపీని బొంద పెట్టి.. నేడు కాంగ్రెస్‌ను బొంద పెడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే పింఛన్లు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. బీజేపీ 2సీట్లు గెలవగానే ఏదో సాధించినట్లు ఎగిరిపడిందని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొట్టే బీజేపీ యత్నాలు ఇక్కడ సాగవన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించలేదని యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్ స్వామి ఆగ్రహానికి గురై పదవి పొగోట్టుకున్నాడని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎండీ.ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పాండరి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి, మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, ఇమ్మడి దశరథ, సంగి వేణుగోపాల్, రంజిత్‌రెడ్డి, కొమ్మగళ్ల దయాకర్, రవి, బొమ్మిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.