హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే క్వారీల యజమానులు బరితెగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అడ్డగోలుగా వాహనాలను ఓవర్‌లోడ్ చేయిస్తూ.. ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారని తెలుస్తున్నది. క్వారీలలో ఓవర్‌లోడ్‌తో బయల్దేరే లారీల్లో డ్రైవర్లతోపాటు యజమానులు కూడా కూర్చుని.. మొత్తం వ్యవహారం చక్కబెడుతున్నట్టు సమాచారం. ఫోన్లలోనే వ్యవహారమంతా నడిపిస్తున్నారని తెలిసింది. ఓవర్‌లోడ్ వాహనాలు అనుకున్న చోటికి ఆటంకం లేకుండా చేరేందుకు బైక్, కారు వంటి వాహనాలను పైలట్‌గా ముందు పంపిస్తున్నట్టు ఆర్టీఏ అధికారుల విచారణలో గుర్తించారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తుంటే.. ఆ విషయం షేర్ చేసుకుంటున్నట్టు చెప్పారు.
ఇటీవల చేవెళ్లలో ఆర్టీసీ బస్‌పై కంకరలారీ పడిపోవడంతో 19 మంది చనిపోయారు. ఇందుకు ప్రధాన కారణం టిప్పర్ ఓవర్‌లోడ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆ లారీలో క్వారీ యజమాని ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విచారణ కొనసాగుతున్నదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదం జరిగితే క్వారీల యజమానులను, లారీల ఓనర్లను బాధ్యులను చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ‘ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్- 1984’లోని కఠినమైన నిబంధనలను అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. క్వారీల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించేలా మైనింగ్‌శాఖ కూడా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,13 తేదీలలో నిబంధనలు ఉల్లంఘించిన 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసి, 750 వాహనాలను సీజ్ చేశామని రవాణాశాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 33 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, 3 ఫ్లయింగ్ స్వాడ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఓవర్‌లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించడానికి, యజమానులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా మైనింగ్‌శాఖకు సిఫారసు చేస్తామని తెలిపారు. వాహనదారుల పర్మిట్, డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని వివరించారు. ఓవర్‌లోడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.