హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్లను శనివారం కేటాయించారు. ఇందులో డిగ్రీ ఫస్టియర్లో మరో 85,680 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. అత్యధికంగా బీకాం కోర్సులో 35 వేల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, దోస్త్-25 కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వివరాలను వెల్లడించారు.
మూడో విడతలో కొత్తగా 82,770 మందితో పాటు గతంలో సీటు దక్కించుకున్న 8,817 మంది బెటర్మెంట్ కోసం వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్నారని చెప్పారు. వీరిలో 85,680 మంది సీట్లను దక్కించుకున్నారు. సీటు వచ్చిన వారు ఈ నెల 30లోపు ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.
దోస్త్ మూడు విడతల్లో సీట్లు పొందినవారంతా జూలై 1లోగా కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయాలని, లేకపోతే సీటు కోల్పోయినట్టేనని స్పష్టంచేశారు. దోస్త్ మరో విడత కౌన్సెలింగ్కు ఇప్పట్లో అవకాశంలేదని, మూడు విడతల ఎప్సెట్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాతే మరో విడత దోస్త్ భర్తీకి అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు.