రంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) హవా కొనసాగుతుంది. అధికారులు పర్మనెంట్ ఉద్యోగులను పక్కనపెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెద్దపీట వేసి వారిద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ముఖ్యమైన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, రిజిస్ట్రేషన్లు వంటి కీలక కార్యాలయంలో ఈ తతంగం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యాలయంలో పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వారికి కీలక బాధ్యతలను అప్పగించడం లేదు. అధికారులు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారానే పలు పనులు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వారికి బదిలీలు కూడా లేవు. దీంతో ఆయా కార్యాలయాల్లో పాతుకపోయినా అవుట్సోర్సింగ్లు అధికారి పనులతోపాటు తమ పనులు కూడా చేసుకుంటున్నారు. అనధికార పనులకు అధికారులు అవుట్సోర్సింగ్లను వాడుకొని పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయాలు కీలకంగా మారాయి. కార్యాలయంలో పనులు జరగాలంటే ముడుపులు ముట్ట చెప్పాల్సిందే. పర్మనెంట్ ఉద్యోగులతో కాని పనులు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా అవుతున్నాయని ప్రచారం ఉంది. జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, ఇరిగేషన్ శాఖలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
రికార్డుల మార్పుతో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నుంచి మినాయింపు వంటి అంశాలు ఇరిగేషన్కు సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ మూడు శాఖలు కీలకంగా మారడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధికారుల కనుసన్నల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని అభియోగాలు ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్యాలయంలో భవన నిర్మాణాల అనుమతులు, లైసెన్సుల జారీ వంటి కీలక బాధ్యతలు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగిస్తున్నారు. కీలక బాధ్యతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాకుండా పర్మనెంట్ ఉద్యోగులకు ఇవ్వాలని ఉన్న నిబంధనలను అధికారులు పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పక్కన పెట్టుకొని పనులు సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని కీలకమైన ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, పెద్ద అంబర్పేట, ఆదిభట్ల వంటి మున్సిపాలిటీలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ సంస్థకు చెందిన ప్రైవేటు ఉద్యోగి లైసెన్సులో జారీతో పాటు డీజిల్, పెట్రోల్ వినియోగం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇతర మున్సిపాలిటీలలో కూడా కీలకమైన పనులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులే నిర్వహిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కీలకంగా మారారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, లేవుట్ల ఏర్పాటులో ఇరిగేషన్ అధికారుల ఎన్ఓసీ, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ధ్రువీకరణ వంటి కీలక బాధ్యతలు కూడా అవుట్సోర్సింగ్కి అప్పగించడం వల్ల జిల్లా పరిధిలోని అనేక లేఔట్లకు అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదంగా మారింది.
రంగారెడ్డి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే అవుట్సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులే అధికంగా ఉన్నారు. అవుట్సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగుల కనుసనల్లోనే ఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయంలో ముడుపులు లేనిదే పనులు ముందుకు జరగడంలేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అవుట్సోర్సింగ్ ప్రైవేటు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్ నగర్ వంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్పిన పనులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ఎవరైనా తమ పనుల కోసం వెళితే పక్కన పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు జిల్లా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.