హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్లు(టీవోఎంవో) అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విధానాలపై ఓనర్లు నిరసన గళమెత్తారు. కొత్త ప్రకటన పాలనీ జీవో 84ని సవరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘టోమో’ ఆధ్వర్యంలో 600 ఏజెన్సీల ప్రతినిధులు అసెంబ్లీని ముట్టడించారు. సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారిని అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒకరిద్దరు బడా ఏజెన్సీల కోసం కాంగ్రెస్ ప్రభు త్వం నూతన ప్రకటనల పాలసీని తీసుకొచ్చిందని, ఈ జీవో వల్ల లక్ష మంది ఉపాధి కోల్పోతున్నామని టోమో జనరల్ సెక్రటరీ రమేశ్ ఆ గ్రహం వ్యక్తంచేశారు.
కేవలం రెండు మూడు పెద్ద సంస్థలకు జీవో 68 నుంచి సడలింపులు ఇచ్చి, చిన్న ఏజెన్సీలను దెబ్బతీశారని, ఇటీవల జారీ చేసిన జీవో 84 నూతన ప్రకటన పాలసీ రూపకల్పనలోనూ అన్యాయం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 1927 నుంచే అవుట్ డోర్ హోర్డింగ్‌లు ఉండేవని, దేశవ్యాప్తంగా ప్రైవేట్ ప్రాపర్టీల హోర్డింగ్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వకపోవడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు తమకు ఇచ్చి న హామీలను పూర్తి విస్మరించి తమ జీవితాలను రోడ్డున పడేసిందని విరుచుకుపడ్డారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని స్పష్టంచేశారు. ఒకటీరెండు రోజుల్లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. ఆ తర్వాత అన్ని పార్టీలతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.