హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులను సత్వరమే పరిష్కరించేందుకు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మూడేండ్లలో 37 పోక్సో కేసుల్లో 39 మందికి కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. వీటిల్లో ఎనిమిది కేసుల్లో దోషులకు యావజ్జీవ శిక్షను విధించింది.
15 కేసుల్లో దోషులకు 20 ఏండ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఒక కేసులో 30 ఏండ్ల జైలు, రెండు కేసుల్లో 25 ఏండ్ల జైలు, ఒక కేసులో పదేండ్ల జైలు, మూడేండ్ల కంటే తక్కువ శిక్షతో 10 కేసులు, రెండు సామాజిక కేసుల్లో శిక్షలు విధించారు. దీంతో ‘సెక్యువల్ అఫెన్సెస్ మాడ్యూల్’ టీమ్‌లో భాగమైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, సిబ్బందిని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు.
ప్రశంసాపత్రాలను కూడా అందజేశారు. పోక్సో కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలను సిబ్బంది సేకరించి, బాధితుల పక్షాన కోర్టులో వాదించి, కేసు గెలిచే తీరు అత్యద్భుతమని ఆమె కొనియాడారు. ప్రశంసాపత్రాలు అందుకున్నవారిలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సైబరాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, రాచకొండ, సూర్యాపేట, వరంగల్, వనపర్తి జిల్లాల సిబ్బంది ఉన్నారు.