హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దొంగిలించబడిన, పోయిన ఫోన్లను ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అందించడంలో తెలంగాణ పోలీసులు అన్ని రాష్ర్టాల పోలీసుల కంటే ముందున్నారు. కేవలం 162 రోజుల్లో 8,285 ఫోన్లను నిజమైన వినియోగదారులకు అప్పగించారు. మొబైల్ దొంగతనాలను అరికట్టడానికి, పోయిన ఫోన్లను వెతికిపట్టుకోవడానికి తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ఏప్రిల్ 19 నుంచి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని సుమారు 31 పోలీస్ యూనిట్ల పరిధిలోని 780 పోలీస్స్టేషన్లకు సీఈఐఆర్ యూజర్ ఐడీలు ఇవ్వడంతో.. పోయిన ఫోన్లను మన పోలీసులు వెతికి పట్టుకుంటున్నారు. ఈ 165 రోజుల్లో 69,889 ఫోన్లను బ్లాక్ చేసి, 10,478 ఫోన్లను ట్రేస్ చేసి, 8,285 ఫోన్లను వినియోగదారులకు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 8,67,549 ఫోన్లను బ్లాక్ చేసి.. 3,28,847 ఫోన్లను వినియోగదారులకు అప్పగించారు.