సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటారు. గ్రీన్కో అనే కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీహిల్స్‌కు కూతవేటు దూరంలోని మాదాపూర్‌లో ఉంటుంది. గ్రీన్కో కంపెనీతో ప్రభుత్వ పెద్దలు ఏదైనా విధానపరమైన ఒప్పందం చేసుకోవాలనుకొంటే హైదరాబాద్‌లోనే చేసుకోవచ్చు.
అయితే, హైదరాబాద్‌కు 7,300 కిలోమీటర్ల దూరంలోని దావోస్‌లో ఓ గదిలో కూర్చొని మరీ డీల్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కూడా పాల్గొన్నారు.
బీజేపీపాలిత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దావోస్‌లో పర్యటించారు. లోధా డెవలపర్స్ కంపెనీ ముంబైలో రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, ఈ మేరకు ఎంవో యూ కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు.ఇంతకీ.. ఈ లోధా డెవలపర్స్ కంపెనీ ఎవరిదంటే.. ఫడ్నవీస్ క్యాబినెట్లో భాగమైన బీజేపీ సీనియర్ మంత్రి, ముంబై వాస్తవ్యుడు మంగల్ ప్రభాత్ లోధాదే!
కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులు దావోస్‌లో చేసుకొంటున్న ఒప్పందాలు, జరుపుతున్న పెట్టుబడుల చర్చలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చెప్పడానికి ఇవి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రజా ధనాన్ని వృథా చేస్తూ.. లోకల్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకొని.. గ్లోబల్ కలరింగ్ ఇస్తూ.. తామేదో గొప్ప విజయాలు సాధించినట్టు గప్పాలకు పోతూ దావోస్ పర్యటనను షోఆఫ్గా మార్చేసిన కాంగ్రెస్, బీజేపీ సీఎంల తీరుపై వ్యాపార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతున్నది. సొంతపార్టీ నేతలతోపాటు మేధావులు, రచయితల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
అడుగడుగునా అనుమానాలే
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు వివిధ దేశాల అధ్యక్షులు, రాయబారులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఈ వేదిక ఎంతో కీలకం. విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ర్టాల సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరవ్వడం సాధారణమే. సదస్సులో భాగంగా తమ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును, తమ దగ్గర ఉన్న పారిశ్రామిక విధానాలు, కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న వనరుల గురించి ఆయా ప్రభుత్వ పెద్దలు పెట్టుబడిదారులకు వివరించి ఎంవోయూలు కుదుర్చుకొంటారు. అయితే, ఈ విషయంలో తెలంగాణ సీఎం, మంత్రుల రూటే సపరేటుగా ఉన్నది. సుదూరంలోని దావోస్‌కు వెళ్లి గ్లోబల్ కంపెనీలతో కాకుండా హైదరాబాద్‌కు చెందిన లోకల్ కంపెనీలతో మన ప్రభుత్వం చర్చలు జరుపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మాత్రం దానికి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి, బృందాలు వేసుకొని మరీ అంత దూరం వెళ్లాలా? అని పలువురు మండిపడుతున్నారు. ఇక, దావోస్‌లో గ్రీన్కో కంపెనీతో తెలంగాణ మంత్రులు పాల్గొన్న భేటీపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన తనయుడు హర్షారెడ్డి పాల్గొనడం వివాదంగా మారింది. హర్షారెడ్డి ఏ హోదాలో మంత్రులతో సమానంగా ఈ భేటీలో పాల్గొన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది అధికారిక కార్యక్రమమా? లేక ప్రైవేట్ కార్యక్రమమా? అని నిలదీస్తున్నారు. స్మగ్లింగ్, భూకబ్జా ఆరోపణలు ఉన్న హర్షారెడ్డిని పెట్టుబడుల భేటీలో కూర్చోబెట్టి మంత్రి పొంగులేటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇదే భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు అనుంగు శిష్యుడుగా పిలిచే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఓ కంపెనీ మధ్య జరుగుతున్న ఈ భేటీలో వేరే పార్టీ, అదీ వేరే రాష్ట్ర ఎంపీ పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రమేశ్ ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? అంటే అదీలేదు. మొత్తంగా ఈ భేటీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నది.
భేటీ మతలబు ఏమిటో?
దావోస్‌లో అసలు ఏం జరుగుతున్నది..? పెట్టుబడుల ఒప్పందాలా..? లేక రాజకీయ ఒప్పందాలా..? ఓవైపు ఫార్ములా-ఈ కేసులో అవినీతి జరిగిందంటూ కేసులు, విచారణలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ఈ కేసులో కీలకమైన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో దావోస్‌లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండడం దేనికి సంకేతం..? ఈ భేటీ కేంద్రంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై మరోసారి కుట్రలకు ప్రణాళికలు రచించారా..? ఇదే భేటీలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ పాల్గొనడానికి కారణమేమిటీ…? ఈ విధంగా దావోస్‌లో సర్కార్ పెట్టుబడుల వేటలో అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ఒప్పందాల సంగతేమో గానీ రాజకీయ ఒప్పందాలు జోరుగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, తెలంగాణకు, హైదరాబాద్‌కు ప్రపంచ యవనికపై మరింత ఖ్యాతిని పెంచేందుకు గానూ నాటి మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా చేశారు.
అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ లక్ష్యంగా ఫార్ములా-ఈ రేసులో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసింది. దీన్ని అతిపెద్ద భూతంగా చూపించే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. దీనిపై కేసులు నమోదు చేసి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారులను విచారణల పేరుతో సతాయించింది. ఫార్ములా రేసుకు గ్రీన్కో కంపెనీ ఒక స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో కంపెనీపైనా కాంగ్రెస్ సర్కారు అవినీతి ఆరోపణలు చేసింది. ఈ కంపెనీ ఆఫీసులపై ఏసీబీతో దాడులు చేయించింది. కానీ ఇప్పుడు అదే గ్రీన్కో కంపెనీతో దావోస్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఓవైపు తమ సొంత ప్రభుత్వమే ఆ కంపెనీపై ఆరోపణలు చేస్తూ, దాడులు చేయిస్తుంటే.. మరోవైపు ఆ సర్కార్‌లోని మంత్రులు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీతో మళ్లీ వ్యాపార ఒప్పందాలు ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే ఆ కంపెనీ ఏ తప్పుడు చేయలేదని ప్రభుత్వం చెప్పదలుచుకున్నదా..? అంటే ఫార్ములా-ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం అంగీకరిస్తున్నదా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కాదంటే ఆరోపణలున్న కంపెనీతో భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటీ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవన్నీ కాకుంటే.. రాష్ట్రంలో ఫార్ములా-ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను ఇరికించేందుకు కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారా..? అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు, తన మంత్రివర్గంలో భాగమైన మంగల్ ప్రభాత్ లోధా అనే బీజేపీ మంత్రికి చెందిన లోధా డెవలపర్స్ కంపెనీతో దావోస్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎంవోయూ కుదుర్చుకోవడం కూడా వివాదంగా మారింది. ముంబైలో కాకుండా అంతదూరం వెళ్లి, అదికూడా విదేశీ కంపెనీతో కాకుండా తన సొంత క్యాబినెట్ సహచరుడి కంపెనీతో ఫడ్నవీస్ సర్కార్ ఎంవోయూ కుదుర్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెరసి కాంగ్రెస్, బీజేపీ సీఎంల వైఖరిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మంత్రి కంపెనీతో ఎంవోయూ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్
తన క్యాబినెట్‌లోని ఓ మంత్రికి చెందిన కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దావోస్ వరకూ వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు. ఆ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి స్విట్జర్లాండ్ వరకూ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇండియాలోనే ఈ డీల్‌ను పూర్తి చేసుకోవచ్చు కదా?! అన్నారు. మొత్తంగా ఈ ఎంవోయూ వెనుక ఇంకా ఏదైనా రహస్యం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
మనల్ని చూసి నవ్వుకొంటున్నారు: జర్నలిస్ట్ సుచేతా దలాల్
దావోస్‌లో సీఎంల చేష్టలను చూసి ప్రపంచ దేశాలు నవ్వుకొంటున్నాయని హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ సుచేతా దలాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. సుచేతా స్పందిస్తూ.. ‘మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, ఏపీ.. ఇలా సీఎంలు అందరూ దావోస్‌కు క్యూ కడుతున్నారు. దేశీయ కంపెనీలతో అక్కడ ఎంవోయూలు కుదుర్చుకోవడం ఎందుకు? ఇక్కడ ఎందుకు ఆ పని చేయరు? ప్రజాధనాన్ని వృథా చేస్తూ ముఖ్యమంత్రులు ఇలా ప్రయాణాలు చేస్తుంటే ప్రధానమంత్రి కార్యాలయం ఏం చేస్తున్నది? అసలు వాళ్లను అలా వెళ్లడానికి ఎలా అనుమతించారు? ఇది అంతర్జాతీయంగా మనకు ఎంతో సిగ్గుచేటు. అవమానకరం. అంతేకాదు, దేశీయ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకొని, వారితో చర్చల్లో పాల్గొని మన సీఎంలు ఫొటోలు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ఇది ఎంతో హాస్యాస్పదం. చవకబారు విషయం. ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుకొంటున్నాయి’ అని సుచేతా దలాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇక్కడైతే, పెన్ను రాయదా?: రచయిత సుహేల్
బీజేపీ, కాంగ్రెస్ సీఎంలు దావోస్ వేదికగా దేశీయ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోవడంపై ప్రముఖ రచయిత సుహేల్ సేత్ మండిపడ్డారు. భారత కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు దావోస్ వరకూ ఎందుకు వెళ్తున్నారని సేత్ ప్రశ్నించారు. ఈ ఎంవోయూలను భారత్‌లోనే కుదుర్చుకొంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎంవోయూపై సంతకాలు పెట్టడానికి భారత్‌లో పెన్ను రాయదా? అని ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్‌లో మంచు, అక్కడి వాతావరణ సోయగాన్ని చూడటానికే ప్రభుత్వాధినేతలు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై తనకు ఎవరైనా క్లారిటీ ఇవ్వాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మోదీ ఎప్పుడు అడ్డుకొంటారో?: రచయిత తవ్లీన్
పన్ను చెల్లింపుదారులు కట్టిన డబ్బును వృథా చేస్తూ సీఎంలు దావోస్ హాలిడేస్‌కు వెళ్తున్నారని ప్రముఖ రచయిత తవ్లీన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారని ప్రశ్నించారు. దావోస్‌కు వెళ్లిన సీఎంలు.. దేశీయ కంపెనీలతోనే ఎంవోయూలు కుదుర్చుకొంటున్నారన్న తవ్లీన్.. అదే పనిని ఇక్కడి ఢిల్లీ, ముంబైలో కూర్చొని కూడా చేయవచ్చు కదా అని హితవు పలికారు. ఇది ట్యాక్స్‌పేయర్ల కష్టాన్ని వృథా చేయడమేనని ధ్వజమెత్తారు.
డబ్బు వృథానే..: కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్
ఇండియన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సీఎం ఫడ్నవీస్ దావోస్ వరకు వెళ్లడం ఎందుకు? అని కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడానికే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. లోధా కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవాలంటే సహ్యాద్రి లేదా మంత్రాలయ లేదా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే మంత్రి మంగల్ ప్రభాత్ లోధా ఆఫీసును ఎంచుకోవచ్చు కదా?! అని అన్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సీఎం, ఆయన పరివారం దావోస్‌కు వెళ్లి ఇండియన్ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకొన్నారని మండిపడ్డారు. ఫడ్నవీస్ సర్కార్ ఎంవోయూ చేసుకొన్నట్టు ప్రకటించిన హీరానందానీ, రహేజా గ్రూప్ ఆఫ్ కంపెనీలు ముంబై కేంద్రంగా పనిచేయడంలేదా? అని ప్రశ్నించారు. వాటితో ఎంవోయూకు దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఒక్క విదేశీ కంపెనీ అయినా వస్తుందా?: కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్
ఇండియన్ కంపెనీలతో దావోస్‌లో ఎంవోయూలు కుదుర్చుకోవడంతో కలిగే లాభమేమిటీ? అని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ప్రశ్నించారు. సీఎం దావోస్ పర్యటనతో ఒక్క విదేశీ కంపెనీ అయినా మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టడానికి వస్తుందా? అని ఫడ్నవీస్ సర్కార్‌ను విజయ్ నిలదీశారు.
షోఆఫ్ కోసమే దావోస్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజీవ్ శుక్లా
పెట్టుబడుల పేరిట దావోస్‌లో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న ముఖ్యమంత్రుల తీరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దావోస్ వేదికను సీఎంలు ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేశారని, షో ఆఫ్ కోసమే వీరంతా అక్కడికి వెళ్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.ఆయన స్పందిస్తూ.. ‘భారతీయులను (ఇండియన్ కంపెనీ ప్రతినిధులను) కలువడానికి ఇక్కడి భారతీయులు (సీఎంలు) సుదూరంలో ఉన్న దావోస్‌కు వెళ్తున్నారు.
ఇక్కడి నుంచి వెళ్లిన సీఎంలే దావోస్ వేదికగా మళ్లీ ఒకరినొకరు కలుసుకొంటున్నారు. ఇది నాకు వింతగా కనిపిస్తున్నది. విదేశీ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకోవడానికి దావోస్‌కు వెళ్లారంటే ఒక అర్థమున్నది. కానీ, భారతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికి స్విట్జర్లాండ్‌కు వెళ్లడం ఎందుకు? ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏమిటీ? ఇది ప్రజాధనాన్ని నేరపూరిత రీతిలో వృథా చేయడమే అవుతుంది. ఇదంతా చూస్తే, అసలు అక్కడ జరుగుతున్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరమా? లేక ఇండియా ఎకనామిక్ ఫోరమా? అని నాకు అనుమానం కలుగుతున్నది. దావోస్ పర్యటన పేరిట ఏడుగురు సీఎంలు అక్కడికి వెళ్లారు. వీరంతా షో ఆఫ్ కోసమే దావోస్‌కు వెళ్లినట్టు నాకు అనిపిస్తున్నది. మొత్తంగా దావోస్ పర్యటనను వీళ్లు ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేశారు’ అంటూ రాజీవ్ శుక్లా విరుచుకుపడ్డారు.
గత పెట్టుబడులు ఎక్కడ?
లోకల్ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకొని గ్లోబల్ బిల్డప్ ఇవ్వడమే కాదు.. గత పెట్టుబడుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అబద్ధాలను వల్లె వేస్తున్నది. గత దావోస్ పర్యటనలో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. 20 కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరినట్టు చెప్పుకొచ్చింది. వీటి ద్వారా సుమారు 47,550 ఉద్యోగాలు వస్తాయని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, ఏడాది గడిచినప్పటికీ, ఆ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకొన్న జేఎస్‌డబ్ల్యూ, వెబ్‌వర్క్స్, గోద్రెజ్, టాటా గ్రూప్, అరగెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలతోనే మళ్లీ రేవంత్ సర్కార్ అప్పట్లో ఎంవోయూలు కుదుర్చుకోవడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. సొంత ఆఫీసు కూడా లేని ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీతో రేవంత్ ప్రభుత్వం నిరుడు రూ. 5 వేల కోట్ల ఎంవోయూ కుదుర్చుకోవడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. మొత్తంగా కిందటేడాది లాగానే ఈ ఏడాది కూడా బోగస్ కంపెనీలతో పెట్టుబడుల నాటకాన్ని రేవంత్ టీమ్ మళ్లీ రక్తి కట్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భేటీలో సీఎం రమేశ్ ప్రత్యక్షం
సీఎం రమేశ్.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చేది చంద్రబాబు అనుంగు శిష్యుడని. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. నాడు చంద్రబాబు సూచనతోనే ఆయన బీజేపీలో చేరారనే ఆరోపణలూ ఉన్నాయి. సీఎం రమేశ్ ఒకచోట ఉన్నారంటే చంద్రబాబు ఉన్నట్టేననే ప్రచారం మొదటి నుంచీ ఉన్నది. అలాంటి వ్యక్తి.. తెలంగాణ మంత్రులైన శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రీన్కో కంపెనీతో నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ మంత్రులు నిర్వహించిన భేటీలో ఏపీకి చెందిన ఎంపీ పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో ఆయన పాల్గొనాల్సిన లోగుట్టు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దూతగా ఈ భేటీలో పాల్గొన్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. భేటీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ భేటీలో బాబు డైరెక్షన్లో, కంపెనీ ప్రతినిధుల ద్వారా ఫార్ములా-ఈ కేస్‌కు సంబంధించి ఏదైనా రాజకీయ కుట్ర రచించారా? అని అనుమానిస్తున్నారు.
మంత్రులతో సమానంగా పొంగులేటి కొడుకు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు హర్షారెడ్డి దావోస్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు.. గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమానంగా హర్షారెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే హర్షారెడ్డిపై విదేశీ వాచ్‌ల స్మగ్గింగ్, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆయన గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో జరిగిన భేటీలో మంత్రులతోపాటు సీఎం రమేశ్ పక్కనే హర్షారెడ్డి కూర్చున్నారు. అసలు ఆయన ఏ హోదాలో ఈ భేటీలో పాల్గొన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు స్మగ్గింగ్ ఆరోపణలు, మరోవైపు భూకబ్జా ఆరోపణలు కలిగిన వ్యక్తిని పెట్టుబడుల భేటీల్లో ఏ విధంగా అనుమతిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.