హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీచేసేందుకు అవకాశం కల్పించింది. బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జీవో 21 జారీచేశారు. ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఒక శాఖ పరిధిలోని ఉద్యోగులను అదేశాఖలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినట్లు జీవోలో పేర్కొన్నారు. బదిలీ కోరుకొనేవారు మార్చి 1 నుంచి 15 వరకు ఐఎఫ్ఎంఎస్ ఫోర్టల్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. ఫిబ్రవరిలో ఈ కోటాలో బదిలీ కోరుకొనేవారిని వెతుక్కొనే అవకాశం కల్పించారు. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు వీ మమత, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూ తెలంగాణ నేతలు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకొనే ఇద్దరిలో ఒకరు జీవో-317 ప్రకారం బదిలీ అయి ఉండాలి.
ఏ విభాగం ఉద్యోగి, తాను పనిచేస్తున్న విభాగంలోనే పరస్పర బదిలీకి అర్హులు. ఇతర విభాగాల్లో బదిలీకి అవకాశం లేదు.
ఉదాహరణకు: స్కూల్ అసిస్టెంట్ (గణితం) టీచర్ పరస్పర బదిలీ కోరితే, మరో జిల్లా నుంచి సైతం స్కూల్ అసిస్టెంట్ (గణితం) టీచరే బదిలీకి సిద్ధపడాలి. ఒకే మీడియం వాళ్లు బదిలీ కోరాలి. తెలుగు వాళ్లకు ఇంగ్లిష్ మీడియం వాళ్లు సిద్ధపడితే అవకాశం ఇవ్వరు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి అదే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు పరస్పర బదిలీ కోరితే పరిగణనలోకి తీసుకోరు. వ్యవసాయశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలో సూపరింటెండెంట్లు పరస్పర బదిలీ కోరినా తిరస్కరిస్తారు.
టీచర్లు, ప్రధానోపాధ్యాయుల బదిలీ విషయంలో స్కూళ్ల యాజమాన్యాలు, మీడియం, సబ్జెక్టు ఒకటే అయి ఉండాలి. బోధనేతర సిబ్బంది విషయంలో జడ్పీ, ఎంపీపీలో పనిచేస్తున్నవాళ్లు తాము పనిచేస్తున్న యాజమాన్యంలో మరో ఉద్యోగిని మాత్రమే ఎంపికచేసుకోవాలి.
పరస్పర బదిలీ అయ్యే వారు.. కొత్త పోస్టింగ్‌లో సీనియారిటీని కోల్పోతారు. జూనియర్‌గా జాయిన్ కావాల్సి ఉంటుంది. తాము కొత్త లోకల్ క్యాడర్లో చివరి ర్యాంక్‌ను తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్టు ఉద్యోగులిద్దరు నిర్దేశిత ఫార్మాట్లో అండర్‌టేకింగ్‌ను సమర్పించాలి.
ఉద్యోగుల వినతులను (దరఖాస్తు) బట్టే బదిలీలుంటాయి. ఇందుకు గాను ఉద్యోగులు టీఏ, డీఏ వంటివి చెల్లించరు.
కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలు, సమాచారమివ్వకుండా అకారణంగా విధులకు గైర్హాజరవుతున్నారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ఒక ఉద్యోగి ఒక్క దరఖాస్తును మాత్రమే సమర్పించాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులను తిరస్కరిస్తారు.
పరస్పర బదిలీ ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీని సంబంధిత విభాగాధిపతి (హెచ్‌వోడీ)కి సమర్పించాలి.
ఒకసారి దరఖాస్తు చేసుకొంటే తప్పులను సవరించుకోవడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
దరఖాస్తులను హెచ్వోడీలు పరిశీలించి, ప్రభుత్వ కార్యదర్శులకు నివేదిస్తారు.
దరఖాస్తులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది.