ముంబై: మద్యపానం వల్ల ఓరల్ క్యాన్సర్ ముప్పు తప్పదు. మద్యానికి సురక్షిత మోతాదు అనేదేమీ లేదు. బీర్, విస్కీ, వైన్, కల్లు, నాటుసారా వంటివాటిలో దేనినైనా రోజుకు అతి తక్కువ మోతాదులో తీసుకున్నా నోటి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయన నివేదిక బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఓరల్ క్యాన్సర్ వృద్ధి విషయంలో మద్యపానానికి సురక్షిత మోతాదు అంటూ లేదని ఈ నివేదిక తెలిపింది. ఆల్కహాల్‌ను ప్రతి రోజూ అతి తక్కువగా తాగినప్పటికీ, నోటి లోపలి భాగాల్లో క్యాన్సర్ వృద్ధి చెందే ప్రమాదం 50 శాతం పెరుగుతుంది.
పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం ఉమ్మడిగా ఓరల్ కేవిటీ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయని మొట్టమొదటిసారి తెలిపిన అధ్యయనం ఇదే. ఈ రెండు అలవాట్లు లేనివారి కన్నా వీరికి ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ. మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో రెండోది ఓరల్ క్యాన్సర్. ఏటా 1,43,000 కొత్త కేసులు నమోదవుతుండగా, సుమారు 80 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి సోకుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రతి లక్ష మందిలో దాదాపు 15 మందికి సోకుతున్నది. ఈ వ్యాధిగ్రస్తుల్లో 43 శాతం మంది కేవలం ఐదేండ్ల కన్నా ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడమాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ దీక్షిత్ మాట్లాడుతూ, మద్య నిషేధాన్ని అమలు చేస్తున్న రాష్ర్టాల్లో మద్యం సంబంధిత ఓరల్ క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు.