హైదరాబాద్ జనవరి 16 (నమస్తే తెలంగాణ): రిమోట్ ఓటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. ఢిల్లీలో ఈసీ సమావేశం నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రిమోట్ ఓటింగ్ విధానం దేశానికి అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తమ అధినాయకత్వంతో చర్చించి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 30లోగా తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేస్తామని చెప్పారు.
మొదటినుంచీ తాము రిమోట్ ఓటింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఆ పద్ధతివల్ల దేశానికి అనర్థమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారనే అనుమానాలు, ప్రచారాలకు ఈసీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు మల్టీ కాన్స్టిట్యుయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించారు.
అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇంగ్లండ్లే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కపెట్టేశాయని తెలిపారు. నిత్యం బ్యాంకులను హ్యాక్ చేస్తున్న ఘటనలు గురించి వింటూనే ఉన్నామని, అలాంటప్పుడు రిమోట్ ఓటింగ్ వ్యవస్థను ఎలా నమ్ముతాం అని ప్రశ్నించారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా నమ్మాలి? అక్కడి నుంచి ఆ ఓటును అతనే వేస్తున్నాడా? హ్యాక్ చేస్తున్నారా అనేది ఎలా తెలుసుకోగలం? అని అనుమానం వ్యక్తంచేశారు. వీటన్నింటిపై పార్టీలో విస్తృతంగా చర్చించిన తర్వాత తమ అభిప్రాయం చెప్తామని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.