మునుగోడు/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు జోరందుకొన్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకోగా.. గురువారం కాంగ్రెస్, టీజేఎస్‌లకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) నియోజకవర్గ కన్వీనర్ నాగిళ్ల శంకర్, సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్రతండా సర్పంచ్ (ఇండిపెండెంట్) కొర్ర లచ్చిరాంనాయక్ టీఆర్ఎస్లో చేరారు. కాగా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండితండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో, అల్లందేవిచెర్వు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.