హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వివిధ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికైన సభ్యులకు తమ పరిధిలోని అన్ని ము న్సిపాలిటీలు, నగరపాలక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై ఎమ్మెల్సీలు భానుప్రసా ద్, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము ఎంపిక చేసుకొన్న మున్సిపాలిటీల్లో జరిగే సమావేశాల్లోనే పాల్గొనే అవకాశం ఉన్నదని, దీనివల్ల తమ నియోజకవర్గంలోని ఇతర మున్సిపల్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. తమ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరా రు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కోఆప్షన్ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ
మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థల్లో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచినందున మైనారిటీల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. జనాభా పరంగా తక్కువ ఉన్నందున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకున్నా, తమ వాయిస్ వినిపించే ఉద్దేశంతో కో-ఆప్షన్ సభ్యుల్లో మైనారిటీలకు అవకాశం కల్పిస్తారని తెలిపారు.