హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నది. పశువుల్లో పడ్డ దూడల (ఆడ దూడలు) సంతతి పెంపు, పాడి రైతులకు ఉపాధి పెంపు లక్ష్యం నెరవేరుతున్నది. దీనికోసం సెక్స్ స్టార్టెడ్ సెమన్ ప్రక్రియను అమలు చేస్తున్నది. ఎదకొచ్చే పశువుల కోసం 65 శాతం సబ్సిడీపై ఈ సెమన్‌ను అందిస్తున్నది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశుసంవర్ధక శాఖ ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో 650 పడ్డ దూడలు పుట్టినట్టు పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మల్లేశ్వరి వెల్లడించారు. అగ్రికల్చర్ ఫామ్ మెకనైజేషన్ పెరగడంతో దున్నలు, కోడె దూడల అవసరం తగ్గుతున్నది. పడ్డ దూడలు పుడితే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది. సెమన్ నుంచి ఎక్స్, వై క్రోమోజోములను వేరుచేసే సెక్స్ సార్టెడ్ సెమన్ పద్ధతిని అమలు చేయనున్నది. ఈ విధానంలో కృత్రిమ గర్భధారణ చేస్తే 96 శాతం పడ్డలే జన్మించే అవకాశం ఉన్నది.
విఫలమైతే పైసలు వాపస్
జాతీయ పాల అభివృద్ధి బోర్డు (ఎన్డీడీపీ) ద్వారా ఎక్స్, వై క్రోమోజోములను వేరు చేసే పద్ధతిని అమలు చేస్తున్నది. కృత్రిమ గర్భధారణకు అవసరమైన పశువుల వీర్యాన్ని సేకరిస్తున్నది. ఒక్కో డోసును రూ.675కు ఇస్తుండగా రైతులు రూ.250 చెల్లిస్తే ప్రభుత్వం రూ.425 సబ్సిడీ అందిస్తున్నది. పశువుకు ఇంజెక్షన్ చేసిన 21 రోజుల్లో గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చకపోతే రెండో డోసుకోసం రైతు మరో రూ.250 చెల్లించి ఇంజక్షన్ చేయించాలి. మొదటిసారి రైతులు చెల్లించిన రూ.250 రైతుకు తిరిగి ఇస్తారు.
ప్రతి మండలానికి బృందం
సెక్స్ సార్టెడ్ సెమన్ సిస్టమ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేసేందుకు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల సెక్స్ సార్టెడ్ సెమన్ ఇంజెక్షన్ డోస్‌లను పంపింది. బృందంలో డాక్టర్‌తోపాటు గోపాలమిత్ర ఉంటారు. 15,915 సెక్స్ సార్టెడ్ సెమన్ ఇంజెక్షన్లను ఎదకొచ్చిన పశువులకు ఇచ్చారు.