హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): భూటాన్ రాజధాని ధింపూలో ‘అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్’ (ఏబీటీవో) కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించారు. ఆసియా హైవే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల్లో బౌద్ధ పర్యాటక స్థావరాలను అధిక సంఖ్యలో సందర్శించేలా వ్యూహాలను సిద్ధం చేసి, ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపునకు తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏబీటీవో ప్రధాన కార్యదర్శి కౌలేశ్ కుమార్, సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి, ఎగ్జాటిక్ ఈవెంట్ అధినేత కేకే రాజా, బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.