BRAOU | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల నిర్వహణకు ఏర్పడ్డ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)ని మరో చోటికి తరలించేందకు రంగం సిద్ధమైంది. మాసాబ్‌ట్యాంక్‌లో ఉన్న ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీని జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ ఓపెన్వర్సిటీలోకి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పది ఎకరాల స్థలాన్ని జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎదుట పెట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఇందుకు ఆమోదం తెలుపడం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఈ ప్రతిపాదనలను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఓపెన్వర్సిటీని నిర్వీర్యం చేసి కాలగర్భంలో కలిపే ప్రయత్నమని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నాయి.
బీఆర్ అంబేద్కర్ వర్సిటీని 1982లో ఏర్పాటుచేశారు. ఈ వర్సిటీకి మొదట్లో 53.63 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలమంతా కొండలు, గుట్టలతో కూడుకొని ఉండటంతో అతికష్టం మీద నిర్మాణాలు చేపట్టి వర్సిటీకి ఒక రూపునిచ్చారు. దీనిలో కొంత కబ్జాకు గురయింది. మరికొంత స్థలాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, ఒక విభాగం ఆఫీసర్ల క్వార్టర్ల కోసం కేటాయించారు. ఆ తర్వాత టీ-శాట్, వీ-హబ్ కోసం కూడా వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి (ఎస్సార్డీపీ)లో భాగంగా దుర్గంచెరువు బ్రిడ్జి కోసం మరికొంత స్థలాన్ని తీసుకున్నారు. ఇలా దాదాపు 13-14 ఎకరాల స్థలాన్ని వర్సిటీ కోల్పోయింది. వర్సిటీలో ఏటేటా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. వర్సిటీ క్యాంపస్‌లోనే థియరీ తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. కొన్ని కోర్సుల పరీక్షలను సైతం వర్సిటీలోనే నిర్వహిస్తున్నారు.
మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూను జూబ్లీహిల్స్‌కు తరలించనుండగా, ఖాళీ అయిన జేఎన్ఏఎఫ్ఏయూ క్యాంపస్‌ను విద్యాకమిషన్ కార్యాలయం కోసం కేటాయించనున్నట్టు తెలిసింది. విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని ఇటీవలే నియమించగా, సభ్యులను నియమించాల్సి ఉన్నది. ఆ తర్వాత కమిషన్ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. విద్యాకమిషన్ కార్యాలయానికి తొలుత బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ భవనంలో మూడో అంతస్తును కేటాయించాలని భావించారు. కానీ ఇటీవలే ఈ కార్యాలయాన్ని ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో జేఎన్ఏఎఫ్ఏయూను బీఆర్ అంబేద్కర్ వర్సిటీకి తరలించి, మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ భవనాలను విద్యాకమిషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయాల కోసం వినియోగించనున్నట్టు తెలిసింది.
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన స్థలాన్ని జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు కేటాయించడాన్ని వర్సిటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వర్సిటీకి చెందిన టీచర్స్, ఫ్యాకల్టీ టీచర్స్ అసొసియేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసొసియేషన్, నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసొసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసొసియేషన్లు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నాయి.