HCU Lands | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని తప్పు పడుతూ విశ్రాంత సివిల్ సర్వీసెస్ అధికారులు తమ గళం విప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన తామంతా రాజ్యాంగ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఐక్యమయ్యామని పేర్కొంటూ కంచ గచ్చిబౌలిలోని అడవిని ధ్వంసం చేయడంపై ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పర్యావరణాన్ని పరిరక్షిస్తామని, వృక్షాలు, జంతుజాలాన్ని కాపాడుతామని వాగ్దానం చేసి, అందుకు విరుద్ధంగా కంచ గచ్చిబౌలిలోని 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లు ఉపయోగించి నేలమట్టం చేసిందని మండిపడ్డారు.
భారత ప్రధానికి మాజీ సలహాదారు టీకే నాయర్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిైళ్లె, మాజీ జాతీయ భద్రతా సలహాదారు విజయలతా రెడ్డి, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబీరో వంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఎఫ్ఎస్ అధికారులు 67 మంది ఈ ప్రకటనపై సంతకం చేశారు. కంచ గచ్చిబౌలిలోని ఆ భూములు అటవీ ప్రాంతం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నదని, కానీ ఈ వాదన అబద్ధమని పేర్కొనడానికి అనేక ఆధారాలున్నాయని తెలిపారు. చెట్లను కూల్చి, అటవీ ప్రాంతాన్ని చదును చేయడాన్ని వ్యతిరేకించిన హెచ్సీయూ విద్యార్థులతో చర్చించడానికి బదులుగా వారి నిరసనలను బలప్రయోగంతో అణచివేయడానికి ప్రయత్నించిందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా 100 ఎకరాల్లో బుల్డోజర్లతో చెట్లను నరికేయడం కలచివేసిందని అసహనం వ్యక్తం చేశారు. సర్కారు చర్యలను అన్ని వర్గాల ప్రజలు తప్పుపట్టడంతో చెట్లను నరకడం ఆపేసిందని పేర్కొన్నారు.
1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. ‘అడవి’ అనే పదానికి సుప్రీం నిర్వచనం ప్రకారం కంచ గచ్చిబౌలి భూముల్లో ఉన్న పచ్చదనం, వృక్ష సంపదే సాక్ష్యమని స్పష్టం చేశారు. 2025 ప్రారంభంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాల్లో క్షేత్రస్థాయి అటవీ ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించిందని, సంబంధిత కమిటీ మార్చి 15న తెలంగాణకు వచ్చిందని తెలిపారు. కానీ ఆ కమిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి ప్రాంతం కూడా అడవి కాదని సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ఇప్పటికైనా తీరు మార్చుకోండి
కంచ గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల్లోని అడవిని ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేసి కాంగ్రెస్ సర్కారు ప్రజలు, పర్యావరణవేత్తల ఆగ్రహానికి గురైందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో వలస పక్షులు, 220 జాతుల పక్షులు, వందల జింకలు, 700 జాతుల మొక్కలు, నక్షత్రపు తాబేళ్లున్నా అడవి కాదనటం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం చదును చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపట్టి, అటవీ ప్రాంతాలను అధికారికంగా గుర్తించి సంరక్షించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణులు, పౌరులు, విద్యార్థుల మాట వినాలని సూచించారు. ఐటీ పార్కు కోసం ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ సహజ వనరులను ధ్వంసం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణ విధ్వంసమేనని విమర్శించారు. సుపరిపాలన అందించాలని దేశమంతటా డిమాండ్ కాంగ్రెస్ చేస్తున్నదని, కంచ గచ్చిబౌలిలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఆ భూములను వేలం వేయడం లేదా కేటాయింపులు జరపాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సూచించారు.