Open School Result | హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గురువారం విడుదల చేసింది. ఎస్సెస్సీలో 51.20 శాతం, ఇంటర్లో 52.72 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొంది. ఎస్సెస్సీ పరీక్షలకు 31,691 మంది విద్యార్థులు హాజరు కాగా 16,226 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలకు 41,668 మందికి 21,967 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 27నుంచి మెమోలను www. telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
మార్కుల్లో పొరపాట్లు ఉంటే జులై 6వరకు డీఈవోలకు లేదా ప్రిన్సిపాళ్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రీ వెరిఫికేషన్, ఆన్సర్ షీట్ జిరాక్స్ కోసం ఈ నెల 18-27వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వీటికోసం ఇంటర్, ఎస్సెస్సీ విద్యార్థులు రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం ఇంటర్ విద్యార్థులు రూ.400, ఎస్సెస్సీ విద్యార్థులు రూ.350 చెల్లించాల్సి ఉంటుంది.