Vote | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లభించనున్నది. ఓటరు చిరునామా మార్పు, వివరాలను సరిచేసుకోవడం, చనిపోయిన వారు, నివాసం మారిన వారి ఓట్లను తొలగించేందుకు వెసులుబాటు ఉన్న ది. అందిన దరఖాస్తులపై ఈ నెల 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు విచారణ చేస్తారు. ఆన్లైన్ ద్వారా https:// voters.eci.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆఫ్లైన్ ద్వారా తహసీల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించవచ్చని పేర్కొన్నది.