కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 5 : బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశంలోని సంపన్నులు పెట్టుబడిదారి వర్గాలకు ప్రయోజనాలు చేకూరేలా బడ్జెట్ ఉన్నదని మండిపడ్డారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో తెలుగు రాష్ర్టాలకు ఇచ్చిన హామీలను మోదీ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. ఎల్ఐసీ, ఎయిర్ఇండియా, రైల్వేలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ సంపదను విదేశీ కంపెనీలకు అప్పగించి బీజేపీ ప్రయోజనాలు పొందుతున్నదని ఆరోపించారు. ఐదు రాష్ర్టాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. రాష్ర్టాల హక్కులను కాపాడేందుకు కేంద్రంపై పోరాడే పార్టీలకు, ప్రజా సంఘాలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.