‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పరకాలలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించి చిన్నారిని ఎత్తుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు
పరకాల, జూలై 27: బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయం చేసేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. కేసీఆర్ గతంలో బహుజనులకు అధిక సీట్లు కేటాయించి న్యాయం చేశారని, రేపు కూడా వారికి న్యాయమైన వాటా ఇచ్చి న్యాయం చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు కుట్టుమిషన్లు, వంద మందికి కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెట్‌రైట్ అవుతారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక-సారక, రాణీరుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చివాత పెట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకొని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ క్యాడర్‌ను కేసీఆరే వచ్చిండని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని కోరారు. పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లోనే 55 ఎంపీటీసీల్లో 32 స్థానాలను అంటే 58% టికెట్లను రేవంత్‌రెడ్డి గాఢనిద్రలో ఉన్నప్పుడే బీసీలకు ఇచ్చామని తెలిపారు. 109 సర్పంచ్ స్థానాల్లో 49 స్థానాలను బీసీలకు ఇచ్చామని, ఆరు జెడ్పీటీసీలో 3, ఆరు ఎంపీపీలో 3 స్థానాలను బహుజనులకే ఇచ్చామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే యూరియా కొరత
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు తెప్పించి బఫర్‌స్టాక్ పెట్టేవారని, అందుకే ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ఎదుట లైన్లో చెప్పులు, ఆధార్‌కార్డులు కనిపించలేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే యూరియా కొరత రైతులను వేధిస్తున్నదని విమర్శించారు. సమయానికి యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తేనే రైతుబంధు గుర్తుకొస్తున్నదని, పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధు వేసి, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నందున మళ్లీ రైతుబంధు వేసిందని విమర్శించారు.
కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, యువతులకు సూటీ బాకీ ఉన్నదని వివరించారు. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు రూ.3వేల కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. కేవలం రూ.300 కోట్లు ఇచ్చి సంబురాలు చేసుకోమంటున్నదని ఎద్దేవా చేశారు. పరకాల నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకున్న మూడు వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం సతాయిస్తున్నదని, లబ్ధిదారుల తరఫున మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోర్టుకుపోతే, న్యాయస్థానం చెప్పినా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని, అవసరమైతే అసెంబ్లీలో కొట్లాడుతామని చెప్పారు.
జిల్లాకో లీగల్ సెల్
ప్రతి జిల్లాకు ఒక లీగల్‌సెల్‌ను ఏర్పాటుచేస్తామని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అక్రమ కేసులు పెడుతుందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి జిల్లాకు బీఆర్ఎస్ లీగల్‌సెల్ ఉంటుందని, ఆక్రమ కేసులపై న్యాయపరంగా కోట్లాడుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరహాలో పార్టీలోని అన్ని విభాగాలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామని వెల్లడించారు.
సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు
సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమలేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కోట్లాడేది బీఆర్ఎస్ దళమేనని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే మంత్రంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలి అన్నట్టు ఎంత పెద్ద నాయకుడైనా తన మండలంలోని అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలిపించుకోవాలని సూచించారు.
అనుమతిస్తే నిరాహార దీక్ష : గండ్ర
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లందించాలనే డిమాండ్‌పై నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టినా, దాడులు చేసినా మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అక్రమ కేసులు పెడుతుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాకు బీఆర్ఎస్ లీగల్‌సెల్‌ను ఏర్పాటు చేస్తాం. ఆక్రమ కేసులపై
లీగల్‌సెల్ న్యాయపరంగా కోట్లాడుతుంది
– కేటీఆర్
హామీలను ఎగబెట్టిన కాంగ్రెస్ సర్కార్‌కు సమ్మక్క- సారక్క, రాణీ రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాతపెట్టాలె. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్‌ను కేసీఆరే వచ్చినట్టు భావించి ఆశీర్వదించాలె..-కేటీఆర్