నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు రాష్ట్ర మంత్రి.. మరొకరు మునుగోడు ఎమ్మెల్యే. వీళ్ల సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు సోదరుల సొంతూరులో రైతు రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. రుణమాఫీ చారిత్రాత్మకమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామాన్ని ‘నమస్తే తెలంగాణ’ బృందం సందర్శించింది.
బ్రాహ్మణవెల్లంలలో మొత్తం 1,089 రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామ రైతులు నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల పరిధిలోని ఎస్బీఐ(2), కెనరా(4), యూనియన్, ఇండియన్ బ్యాంకు, సహకార బ్యాంకులకు సంబంధించిన మొత్తం 9 బ్రాంచీలపై ఆధారపడతారు. వాటి పరిధిలో మొత్తం 925 మంది రైతులు పంట రుణాలు పొందినట్టు వ్యవసాయ అధికారుల అంచనా. వారిలో కేవలం 433 మందికే రుణమాఫీ లబ్ధి చేకూరినట్టు తెలిసింది. తొలివిడతలో 156 మందికి, రెండో విడతలో 88మందికి, మూడో విడతలో 189 రైతులకు మాఫీ వర్తించింది. 110 మందికి రేషన్ కార్డు లేదని, 50 మంది వివరాలు లేవని మాఫీ కాకపోగా, మిగిలిన 332 మందికి రుణమాఫీ వస్తుందా? రాదా? కారణాలేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద వ్యవసాయ అధికారులను అడగమని తిప్పి పంపుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ అధికారులు మాత్రం రుణమాఫీ డేటాతో మాకు సంబంధంలేదని స్పష్టం చేస్తున్నారు. డేటా బ్యాంకుల వద్ద నుంచి ప్రభుత్వానికి వెళ్లింది కాబట్టి వాళ్లే సమాధానం చెప్పాలని దాటవేస్తున్నారు. బ్యాంకర్ల ఈసడింపులు, వ్యవసాయ అధికారుల నిస్సహాయత నడుమ చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని బ్రాహ్మణవెల్లంల రైతులు చెప్తున్నారు.
ఖాతాకు పనికొచ్చిన ఆధార్.. మాఫీకి పనిచేయదా ?
మూడేండ్ల కింద నార్కట్‌పల్లి బ్యాంకులో 50వేలు లోన్ తీసుకున్న. ప్రభుత్వం మూడు సార్లు మాఫీ చేసినా లిస్టులో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదో ఎవరూ చెప్పడం లేదు. బ్యాంకు వాళ్లని అడిగితే నీ ఆధార్‌కార్డు లింక్ కాలేదు అంటున్నరు. నేను ఆధార్ కార్డు పెట్టే ఖాతా తీసుకున్నా. ఖాతాకు పనికొచ్చిన ఆధార్.. మాఫీకి లేదంటే ఎట్లనో చెప్పేటోళ్లే లేరు.
– మైల పిచ్చయ్య, రైతు, బ్రాహ్మణవెల్లంల
పేరుకే పెద్దూరు..
నేను ఇండియన్ బ్యాంకులో లక్షా 30వేల క్రాప్ లోన్ తీసుకున్న. రుణమాఫీపై గంపెడాశ ఉండె. ప్రతియేటా వడ్డీకట్టినా నా లోన్ మాఫీ కాలేదు. 20 రోజుల నుంచి బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న. వీళ్లనడిగితే వాళ్లనడుగు.. వాళ్లనడిగితే వీళ్లడుగు అంటున్నరు. పేరుకు మాత్రం పెద్దూరు. న్యాయం మాత్రం జరుగుతలేదు.
– మైల రామలింగయ్య, కొత్తగూడెం, బ్రహ్మణవెల్లంల
చెప్పులరిగేలా తిరుగుతున్నా
నేను బ్యాంకులో రూ.40వేలు లోన్ తీసుకున్నా. ప్రతి సంవత్సరం వడ్డీ కడుతున్న. తొలి విడుతలోనే రుణమాఫీ కావాలి. ఇప్పటివరకు కాలేదు. ఎందుకని అడిగితే చెప్పేటోళ్లే లేరు. ఆధార్ కార్డు అడిగితే ఇచ్చిన. రేషన్ కార్డు కూడా ఉంది. కానీ ఎందుకు కాలేదో తెలుస్తలేదు. చెప్పులరిగేలా తిరుగుతున్నా. దండం పెడుతున్న సారూ..న్యాయం చేసి ఆదుకోండి.
-కాసం అయిలయ్య, రైతు, బ్రాహ్మణవెల్లంల
మా ఇంట్లో ఎవరికీ కాలేదు
నా పేరు మీద లక్షా 5 వేలు, మా ఆయన పేరున 98వేలు.. మొత్తం 2 లక్షల 3 వేల రూపాయలు క్రాప్‌లోన్ ఉంది. మా ఇద్దరిలో ఎవరికీ రుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులు పైనున్న మూడు వేలు కట్టండి ఫస్ట్ అంటున్నరు. కడితే ఇస్తారా అంటే దానికి గ్యారంటీ ఇస్తలేరు. ఈ సర్కార్‌లో అంతా అయోమయంగా ఉంది.
– పల్లె కవిత, బ్రాహ్మణ వెల్లెంల
సీఎంనే అడుక్కోపో అన్నరు
నార్కట్‌పల్లి కో అపరేటివ్ బ్యాంకులో అరవై వేలు క్రాప్ లోన్ తీసుకున్న. నాకు ఫస్టే మాఫీ కావాల్సి ఉండే.. కానీ రాలేదు. అప్పటి నుంచి బ్యాంకులు, వ్యవసాయ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న. ఆన్లైన్లో పేరెందుకు లేదని అడిగితే.. సీఎం రేవంత్‌రెడ్డినే అడుక్కోపో అంటున్నరు. మా ఊరి మాజీ సర్పంచ్ చేత కూడా చెప్పించిన. పట్టించుకున్నోళ్లు లేరు. ఇది దండుగ ప్రభుత్వం.
-కాసం మల్లయ్య, రైతు, బ్రాహ్మణవెల్లంల