Achampet | అచ్చంపేట, జనవరి 17 : అత్యాశకుపోయి ఆన్లైన్ యాప్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు. అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, ఉప్పునుంతల, కల్వకుర్తికి చెందిన కొందరు డెకత్యాప్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని భావించారు.
రూ.50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.3 వేలు చొప్పున 30 రోజులపాటు, రూ.లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ.5 వేల చొప్పున 30 రోజులు.. ఇలా ఎంతపెట్టుబడి పెడితే అంత రోజువారీగా ఇచ్చేవిధంగా రూ.1.50 లక్షల వరకు పెట్టారు.
దీంతో రూ.650 నుంచి రూ.1.50 లక్షల వరకు నాలుగు నెలలుగా అచ్చంపేట ప్రాంతంలోనే దాదాపు రూ.కోటికిపైగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఓ రైతు పత్తి అమ్మగా వచ్చిన రూ.1.50 లక్షలు అందులోనే పెట్టుబడి పెట్టాడు. రోజూ డబ్బులు వస్తుండటంతో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేశాక యాప్ను తొలగించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.