ధర్మారం/రామడుగు/బోయినపల్లి, జూలై 30 : కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. లింక్-2లో దిగువ నుంచి ఎగువకు ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరవళ్లుతొక్కుతున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఐదు మోటర్లు (2,3,5,6,7వ) నడుస్తున్నాయి. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 15,750 క్యూసెక్కులు డెలివరి సిస్టర్న్‌ల ద్వారా ఎగిసిపడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అక్కడ రిజర్వాయర్ గేట్లను ఎత్తడంతో అంతే మొత్తంలో జలాలు అండర్ టన్నెళ్లలో గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. అక్కడా ఐదు మోటర్లు ద్వారా 15,750 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరి సిస్టర్న్‌ల ద్వారా ఎగిసిపడ్డ జలాలు మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి. మధ్యమానేరు పూర్తి నీటి సామర్థ్యం 27.054 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.84 టీఎంసీలకు చేరుకున్నది.