యాచారం, ఏప్రిల్ 10: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల ఫెన్సింగ్ పనులు గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. మహేశ్వరం అదనపు డీసీపీ వెంకటసత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఫార్మాసిటీ పీఎస్ సీఐ కృష్ణంరాజు సమక్షంలో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో కలిసి తహసీల్దార్ అయ్యప్ప, ఆర్ఐలు మురళీకృష్ణ, రామకృష్ణ ఫార్మా భూముల సర్వే కొనసాగిస్తున్నారు. సర్వే చేసిన భూములకు జేసీబీలు, కూలీలతో కందకాలు తీసి వెంటవెంటనే హద్దులను గుర్తించి, ఐరన్ పిల్లర్లు పాతి, ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు సర్వే పనుల వద్దకు రైతులు, గ్రామస్తులు, ఆందోళనకారులు రాకుండా భద్రతను ఏర్పాటుచేశారు. 8మంది సీఐలు, 15 మంది ఎస్సైల ఆధ్వర్యంలో 150 మంది సివిల్, స్పెషల్ పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు నడుమ ఫెన్సింగ్ పనులను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 150కిలో మీటర్ల మేరకు సర్వే చేసి ఫెన్సింగ్ చేపట్టినట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.