Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్ టైమ్ చాన్స్ కల్పించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఓయూ అకాడమిక్ సెనేట్ స్టాండింగ్ కమిటీ అనుమతించిందని చెప్పారు. 2000 సంవత్సరం తరువాత ఆయా కోర్సుల్లో చేరినవారు సైతం తమ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చామన్నారు.
ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫీజును ఈ నెల 24వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో కలిపి 27వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అన్ని కోర్సుల పరీక్షలకు సాధారణ పరీక్షా ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే వారు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.