హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల క్రెడిట్లపై ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇటీవలే డిగ్రీ క్రెడిట్లను 150 నుంచి 124కి తెలంగాణ ఉన్నత విద్యామండలి తగ్గించిన విషయం తెలిసిందే. తా జాగా మూడేండ్ల డిగ్రీ కోర్సులో మొత్తం క్రెడిట్లను 142గా ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన 7వర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో డిగ్రీలో క్రెడిట్లపైనే ప్రధానంగా చర్చించారు.
లాంగ్వేజ్ క్రెడిట్లను 20 నుంచి 12 క్రెడిట్లకు తగ్గించారు. దీనిపై భాషాభిమానాలు, వివిధ వర్సిటీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల వీసీలతో సంప్రదింపులు జరిపి డిగ్రీ కెడిట్లను 142గా ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో ఈ కామన్ క్రెడిట్స్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 15 నుంచి 20 శాతం మేర సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు.