హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మైనర్ పిల్లల పాస్పోర్ట్ జారీకి తల్లిదండ్రులు ఇద్దరి సంతకాలు అవసరంలేదని, వారిద్దరిలో ఏ ఒకరి సంతకం ఉన్నా సరిపోతుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం మైనర్ పిల్లలు రక్షణలో ఉన్న సింగిల్ పేరెంట్ సంతకంతో జారీ చేవయచ్చని వెల్లడించింది. తండ్రి సంతకం లేకుండా పాస్పోర్ట్ జారీ చేయడానికి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ నాలుగేండ్ల జైనాబ్ ఆలియా మహమ్మద్ అనే బాలిక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య విచారణ జరిపి తీర్పు వెలువరించారు. మైనర్ పిల్లలకు సింగిల్ పేరెంట్ దరఖాస్తు చేయరాదని 1967 పాస్పోర్ట్ చట్టంలో కానీ, 1980 నిబంధనల్లో గానీ ఎకడా నిషేధం లేదని అన్నారు. మైనర్ పిల్లలు ప్రత్యేక కస్టడీలో ఉన్నప్పుడు సింగిల్ పేరెంట్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తును తిరసరించడం రాజ్యాంగం ప్రసాదించిన హకులకు విరుద్ధమని అన్నారు. ప్రస్తుత కేసులో భర్త అందుబాటులో లేరని, అంతేగాకుండా పిటిషనర్ తల్లిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. బాలిక తల్లి రక్షణలోనే ఉన్నదని, అందువల్ల తండ్రి సంతకంతో నిమిత్తం లేకుండా పాస్పోర్ట్ జారీచేయాలని ఆదేశించారు.