హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేసే ఓ లెక్చరర్‌ను ఏకంగా నారాయణపేట జిల్లా కొత్తపల్లికి, రా్రష్ట్ర సరిహద్దులో గల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జూనియర్ కా లేజీలో పనిచేసే లెక్చరర్‌ను సికింద్రాబాద్ మారేడుపల్లికి.. ఇది ఇంటర్లో ఆన్‌డ్యూటీల విచిత్రాలు. ఈవింతలకు ఇంటర్ అధికారులిచ్చిన ఆన్‌డ్యూటీ ఉత్తర్వులు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 20 మందిని ఆన్‌డ్యూటీపై బదిలీ చేశారు. వీరిలో 15 మంది జూనియర్ లెక్చరర్లు, ఐదుగురు లైబ్రేరియన్లు ఉన్నారు. 2026-27 విద్యాసంవత్సరం మొత్తం ఓడీ వేసిన కాలేజీల్లోనే పనిచేయాలని, జీతాలు మాత్రం పోస్టింగ్ ఇచ్చిన చోటు నుంచే పొందాలని తాజాగా ఆదేశాలిచ్చారు. నిజానికి లెక్చరర్ అనేది మల్టీజోన్ పోస్టు.
కానీ మల్టీజోన్-1లో పనిచేస్తున్న వారిని మల్టీజోన్-2కు ఆన్‌డ్యూటీల పేరిట పంపించారు. ఒక మల్టీజోన్‌లో పనిచేసే వారిని మరో జోన్‌కు పంపించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతునాయి. దీనిపై వివరణ కోసం ఇంటర్ విద్యా కమిషనర్ అభిలాష అభినవ్‌ను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి కలిసేందుకు ప్రయత్నించగా, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం.
తాజాగా ఓడీలు ఇచ్చిన వారిలో అత్యధికులు మారుమూల ప్రాంతాల నుంచి అర్బన్ వచ్చినవారే. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి హయత్‌నగర్‌కు, అమ్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు, ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్‌కు లెక్చరర్లను ఓడీల పేరిట బదిలీ చే శారు. ఓ మహిళా లెక్చరర్ భర్త చనిపోగా, సు దూరంలో ఉన్న తనను వేరే కాలేజీకి పంపించాలని కోరితే పట్టించుకోలేదంటున్నాయి.
ఇంటర్ విద్యలో ఆన్‌డ్యూటీల పేరిట భారీ దందా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు ఓ ముఠాగా ఏర్పడి ‘దగ్గరైతే యాభై.. దూరమైతే లక్ష’ అంటూ బేరాలకు దిగుతున్నారట. తాజాగా ఓడీ ఉత్తర్వులు వెలువడటంతో ఆ సంఖ్య పెరిగిందట. 200 మంది వరకు లెక్చరర్లు, లైబ్రేరియన్లు క్యూ కట్టారట. బుధవారం రాత్రికి ఉత్తర్వులొస్తాయి, రాత్రికే చేతికిస్తామని చెప్పడంతో కొందరు హైదరాబాద్‌కు ఆర్డర్ల కోసం చేరుకుని నిరీక్షించినట్లు ప్రచారం జరుగుతున్నది. కొందరు నాంపల్లి, మరికొందరు గన్‌ఫౌండ్రీలోని ఓ కాలేజీ ప్రాంగణంలో ఆర్డర్ల కోసం వేచిచూసినట్లు సమాచారం.