హైదరాబాద్ : ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కెన్యా నుంచి వచ్చిన 24 ఏండ్ల మహిళను టిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సోమాలియాకు చెందిన 23 ఏండ్ల యువకుడిని ట్రేస్ చేస్తున్నామని శ్రీనివాస్ రావు బుధవారం ఉదయం తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు అతని ఆచూకీని కనుగొన్నారు. బంజారాహిల్స్‌లోని పారామౌంట్ కాలనీలో సోమాలియా దేశస్థుడిని గుర్తించి టిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కెన్యా, సోమాలియాకు చెందిన వీరిద్దరూ కూడా టోలిచౌకీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కుటుంబ సభ్యులను గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు.