EAPCET | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : అరవై ఏండ్ల వయస్సులోనూ మాకేం తక్కువ అంటూ టీనేజర్లతో పోటీపడుతున్నారు కొందరు వృద్ధులు. అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ పరీక్షకు 56, 58 ఏండ్ల వయస్సు వారు దరఖాస్తు చేశారు. 56 ఏండ్ల గల పెద్దాయన ఇంజినీరింగ్‌కు, 58ఏండ్లున్న మరో పెద్దాయన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి దరఖాస్తు చేశారు. ఎప్‌సెట్ దరఖాస్తు స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది.
ఎప్‌సెట్‌కు 3.06 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్‌కు 2.20లక్షలు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 86వేలు, రెండు పేపర్లు రాసేందుకు 254 మంది చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 29 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి మూడు సెషన్లు, ఇంజినీరింగ్‌కు మొత్తం 6 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 112, ఇంజినీరింగ్ విభాగం పరీక్షల కోసం 124 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు.