హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగా): పుస్తకాలు స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ నమ్మించి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవోను శుక్రవారం ఢిల్లీలో నగర సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లో సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వివరాలు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన దీపక్ శర్మ తన బంధువైన అమిత్ శర్మ ఆధార్‌కార్డుపై తన ఫొటో పెట్టి జీరాక్స్ తీశాడు. దీని ఆధారంగా తన పేరు అమిత్ శర్మ అంటూ హైదరాబాద్ వచ్చి చలామణి అయ్యాడు. ఇతను జులై 2021లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక బ్రాంచిని ఏర్పాటుచేశాడు. అలాంటి బ్రాంచినే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రారంభించాడు. అనంతరం డిజిటలైజేషన్ చేసే స్కానింగ్ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయంటూ పేపర్లలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లతో ప్రచారం చేశాడు. తన సంస్థలో ఘజియాబాద్‌కు చెందిన సయ్యద్ సమీరుద్దీన్, ఆశీష్‌కుమార్ అలియాస్ ఆశీష్‌ను డైరెక్టర్లుగా పేర్లు నమోదు చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన అమిత్ శర్మ (ప్రధాన నిందితుడి పేరు ఉన్న మరో వ్యక్తి)ను బంజారాహిల్స్‌లోని కార్యాలయం ఇన్‌చార్జీగా నియమించుకొన్నాడు.
కరోనా తరువాత అఫ్రికా తదితర దేశాలలో పుస్తకాలు ఎవరూ చదవడం లేదని, అందుకే పాత నవలలు, ఇతర పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని అమిత్ శర్మగా పేరు మార్చుకున్న దీపక్‌శర్మ నమ్మించాడని జాయింట్ సీపీ తెలిపారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 10 వేల పేజీలను స్కానింగ్ చేసేందుకు ఇచ్చి, రూ.50 వేల బిల్లు చెల్లిస్తామని ఆశపెట్టి చాలామందిని సభ్యులుగా చేర్చుకొన్నాడు. ఒక్కో పేజీకి రూ.5 చొప్పున బిల్లు చెల్లిస్తూ వచ్చాడు. మొదట్లో అందరికీ నెలవారీగా బిల్లులు చెల్లించడంతో వేగంగా ఈ స్కామ్ ప్రజల్లోకి వెళ్లింది. లక్ష పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చొని నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చనే విషయం అంతటా పాకింది. తక్కువ సమయంలోనే 623 మంది సభ్యులుగా చేరగా, వీరి నుంచి రూ.15కోట్లు వసూలు చేశాడు. ఇందులో 150 మంది మినహా మిగతా వారికి ఎంతో కొంత డబ్బులు తిరిగివచ్చాయి. ఈ ఏడాది జులైలో డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎత్తేసి, పరారయ్యాడు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్లు సయ్యద్ సమీరుద్దీన్, ఆశిష్‌కుమార్, అమిత్ శర్మను అరెస్ట్ చేశామని జాయింట్ పీపీ తెలిపారు. నిందితుడికి సంబంధించిన కార్యాలయంలో లభించిన ఆధార్ కార్డు వివరాలతో యూపీకి వెళ్లడంతో అక్కడ అసలైన అమిత్ శర్మ పోలీసులకు దొరికిపోయాడు. అయితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని తెలిపినట్టు జాయింట్ పీపీ పేర్కొన్నారు. దీపక్ శర్మ ఇచ్చిన సమాచారంతో సీసీఎస్ టీమ్-3 ఏసీపీ ఎస్వీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం నిందితుడు దీపక్ శర్మ(అమిత్‌శర్మ)ను ఢిల్లీలో పట్టుకొని, హైదరాబాద్‌కు తరలించినట్టు వివరించారు.
నిందితుడి ఖాతాలను పరిశీలించిన తరువాత రూ.15 కోట్ల వరకు స్కామ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. వసూలు చేసిన డబ్బుతో రెండు కిలోల బంగారం కొని, దానిని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టాడని జాయింట్ సీపీ వివరించారు. దీనిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఇదిలావుండగా, నిందితుడు కోఠి, ఇతర ప్రాంతాలలో పాత పుస్తకాలను తెచ్చి వాటిని విడగొట్టి తమ వద్ద డిపాజిట్ చేసిన వారికి స్కానింగ్ కోసం అందజేసే వాడని, సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బునే రోటేషన్ చేశాడని జాయింట్ సీపీ తెలిపారు.
అధిక రాబడి చూసి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ప్రజలకు జాయింట్ సీపీ గజారావు భూపాల్ సూచించారు. ఇలాంటి అత్యాశ పెట్టె స్కీంలకు దూరంగా ఉండాలని కోరారు.