మియాపూర్, నవంబర్ 20: వృద్ధులు, దివ్యాంగులు తమ ఇండ్ల నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. దేశంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. ఈసీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. 12 పోలింగ్ బృందాలను రంగంలోకి దింపి ఆ నియోజకవర్గంలో 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగుల ఇండ్ల వద్ద ఓటింగ్ చేపట్టారు.
తొలిరోజు 371 మంది వృద్ధులు, వికలాంగులు 12డీ ఫారంలను బీఎల్వోలకు సమర్పించి ఓటు వేశారు. అత్యంత పకడ్బందీగా సాగిన ఈ ప్రక్రియను నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఆర్వో) శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏఆర్వో రజనీకాంత్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ప్రక్రియను వీడియోలో రికార్డు చేశారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. 12డీ ఫారంను సమర్పించినప్పటికీ ఇంటి నుంచి ఓటు వేయనివారిని ఓటు వేసినట్టుగా అధికారులు పరిగణించనున్నారు.