Sainik School | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరాలనుకునే విద్యార్థుల ఆశలపై పాఠశాల అధికారులు నీళ్లు చల్లారు. తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను రద్దుచేశారు. 2025-26 విద్యాసంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు ఈ హోదాలో ప్రవేశాలు నిలిపివేశారు. ఏప్రిల్ 30న పాఠశాల ప్రిన్సిపాల్ లేఖ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో హోం స్టేట్ స్టేటస్ కింద తెలంగాణ, ఏపీ విద్యార్థులకు 67% సీట్లున్నాయి. ఈ సారి తెలంగాణ నుంచి 20వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్‌లో పరీక్ష కూడా రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏండ్లు పూర్తికావడంతో తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను ఉపసంహరించారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులకు తీరని నష్టం జరగనున్నది. తెలంగాణ విద్యార్థులు ఆలిండియా కోటాలో అన్ని రాష్ర్టాల విద్యార్థులతో 33శాతం కోటా సీట్లకు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో కొత్త సైనిక్ స్కూల్ ప్రారంభించే వరకు తెలంగాణ హోం స్టేట్ హోదాను పునరుద్ధరించాలని విద్యాశాఖ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి రక్షణశాఖ రిమార్క్స్ అడిగినట్టు తెలిసింది.
సైనిక్ స్కూళ్ల మంజూరు విషయంలో రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నది. కేంద్రం మొండిచెయ్యి చూపిస్తున్నది. గతంలో ఒక సైనిక్ స్కూల్‌ను మంజూరుచేసినట్టు ప్రకటించారు. ఇది కాగితాలకే పరిమితమయ్యింది. వరంగల్ జిల్లా ధర్మాసాగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మహబూబ్‌నగర్ జిల్లాకు సైనిక్ స్కూళ్లు ఇవ్వాలని రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు వెళ్లాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, హుస్నాబాద్‌లోనూ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఫలితం లేకుండా పోయింది. ఇటీవలీ కాలంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో(పీపీపీ) కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిస్తున్నది. పీపీపీ పద్ధతిలోనైనా స్కూల్‌ను కేటాయించలేదు. ఒక వైపు కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశాలు లేకపోవడం, తెలంగాణలో కొత్త సైనిక్ స్కూళ్లు ఏర్పాటు కాకపోవడంతో మన రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
మన పక్క రాష్ట్రమైన ఏపీకి అడిగినన్నీ సైనిక్ స్కూళ్లను కేంద్రం మంజూరుచేస్తున్నది. ఇప్పటికే ఏపీలో కోరుకొండ, కలికిరి, కృష్ణపట్నంలో మూడు సైనిక్ స్కూళ్లుండగా, తాజాగా విజయవాడ సమీపంలోని కేతనకొండకు సైనిక్‌స్కూల్ మంజూరయ్యింది. దీంతో ఏపీలో సైనిక్ స్కూళ్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ పదకొండేండ్లల్లో తెలంగాణకు ఒక్క కొత్త సైనిక్ స్కూల్‌ను కూడా కేటాయించలేదు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా.. మోదీ మంత్రివర్గంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.