హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులను నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో జరిగే ఎన్సీడీసీ సమావేశానికి రాష్ట్రం తరఫున పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్ రాంచందర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో గొర్రెల పంపిణీకి అవసరమైన రుణం గురించి వివరించనున్నారు. రూ.5 వేల కోట్ల రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్సీడీసీకి అందజేసింది. దీంతో ఎన్సీడీసీ అధికారి ఇటీవల రాష్ర్టానికి వచ్చి వివరాలను సేకరించడంతోపాటు గొర్రెల పంపిణీ పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో జరిగే ఎన్సీడీసీ సమావేశంలో దీనిపై చర్చించనుండటంతో రుణం మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.